సజ్జలకు కోపమొచ్చింది, నువ్వే పేపర్? ఏ మీడియా అంటూ..?

బుధవారం, 4 ఆగస్టు 2021 (21:15 IST)
రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డికి కోపమొచ్చింది. నువ్వే పేపర్, నువ్వే మీడియా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిపైనే చిందులు తొక్కారు. 
 
తిరుపతి కరకంబాడి రోడ్డులో ఒక ప్రైవేటు హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు సజ్జల రామక్రిష్ణారెడ్డి. సజ్జలతో పాటు పలువురు వైసిపి ఎమ్మెల్యేలు కూడా హోటల్ ఓపెనింగ్‌కు వచ్చారు.
 
కార్యక్రమం పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడనని కూర్చుని పోయిన సజ్జల చాలాసేపటి వరకు హోటల్ లోని ఒక గది నుంచి బయటకు రాలేదు. ఆ తరువాత బయటకు వచ్చిన సజ్జల నేను మాట్లాడనన్నానుగా అంటూ మైకులను తోసుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు.
 
దీంతో మీడియా ప్రతినిధులు వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎపిలోని అమరరాజా పరిశ్రమ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతోందని.. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో సమాధానం చెప్పలేక నువ్వు ఏ పేపర్.. ఏ మీడియా ముందుగా చెప్పు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
 
అవును. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆలస్యంగానే జీతాలను ఇస్తున్నాం. త్వరలోనే గాడిలోకి వస్తాం. ఎందుకు తొందరపడతారు. గాలి, నీటిని కాలుష్యం చేయకుండా ఉంటే అమరరాజా ఫ్యాక్టరీ ఇక్కడే ఉండేది. పొల్యూషన్ బోర్డు స్వయంగా పరిశీలించి నోటీసులు కూడా ఇచ్చింది కదా ఇంకా ఏం చెప్పాలి. ఏ పరిశ్రమలను ఎపి నుంచి వెళ్ళిపొమ్మని ప్రభుత్వం చెప్పదు అన్నారు సజ్జల. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు