వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, వై.ఎస్.షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేవలం రాజకీయ పరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జగన్, షర్మల మధ్య ఉన్నవి కేవలం రాజకీయపరమైన విభేదాలు మాత్రమేనని చెప్పారు. వైఎస్ఆర్ ఫ్యామిలీలో గొడవలు లేవన్నారు. షర్మిల రాజకీయంగా తప్పటడుగు వేశారని అన్నారు. షర్మిల పట్ల ఒక అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇకపోతే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే తమకు జాలేస్తుందన్నారు. రాజకీయాలపై ఆయనకు ఏమాత్రం క్లారిటీ లేదన్నారు. ఎంతో చరిష్మా ఉన్న పవన్‌కు రాజకీయ అవగాహన ఉంటే పదేళ్లుగా ఇలాంటి రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. పవన్‌పై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలేదన్నారు.
ఇకపోతే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కేవలం ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగానే ఇంతకాలం సంబంధం కొనసాగించారని తెలిపారు. ఎన్డీయేలో చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని... ఎన్డీయేతో కలవాలనుకుంటే ఎప్పుడో కలిసేవాళ్లమని అన్నారు. ఎవరితోనూ పొత్తు వద్దు అనుకున్నాం కాబట్టే ఎన్డీయేలో చేరలేదని చెప్పారు. నలుగురితో కలసి పోటీ చేస్తే తేడాలొస్తాయని అందుకే తాము ఎన్డీయేలో చేరలేదని చెప్పారు.