పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని అందువల్ల ఆయనను చిత్తుగా ఓడించి అక్కడ పార్టీని నిలబెట్టడమేకాకుండా, మరింతగా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇందుకోసం సీఎం జగన్... పిఠాపురం ఎమ్మెల్యె పెండెం దొరబాబును స్వయంగా తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించి మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబుకు పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించిన సీఎం జగన్.. ఈ దఫా అక్కడ నుంచి వంగా గీతను నిలబెట్టిన విషయం తెల్సిందే.
దీంతో పెండెం దొరబాబు తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. అదేసమయంలో పిఠాపురంలో పోటీ చేసే పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నడకవంటిదేనని పిఠాపురం ఓటర్లు చెబుతున్నారు. దీంతో వైకాపా వణికిపోతున్నారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుకే టిక్కెట్ రాకపోవడంతో తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్న దొరబాబును పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు.
"పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో అక్కడ పార్టీని బలోపేతం చేయాలి. మీరు పూర్తిస్థాయిలో సహకరిస్తేనే పార్టీ నిలబడగలదు. పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేసి పార్టీని నిలబెట్టండి" సీఎం జగన్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. సీఎంతో భేటీ తర్వాత ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని, వైకాపా అభ్యర్థి వంగా గీతను గెలిపించుకోవాలని సీఎం జగన్ తనను కోరారు. అలాగే పని చేస్తానని ఆయనకు చెప్పా" అని దొరబాబు మీడియాకు తెలిపారు.