సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

ఠాగూర్

గురువారం, 19 సెప్టెంబరు 2024 (10:49 IST)
గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తన సొంత పత్రిక 'సాక్షి'కి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు, అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అనేక తప్పుడు విధానాలు అనుసరించారని రాష్ట్ర మంత్రివర్గం మండిపడింది. వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనిపించేందుకు రెండేళ్లలోనే ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు వెచ్చించారని, ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన భార్య చైర్మన్‌గా ఉన్న పత్రికకు ప్రజాధనాన్ని దోచిపెట్టిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. 
 
జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో 'సాక్షి'కి ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.443 కోట్లు దోచి పెట్టిందని, మిగతా పత్రికలన్నింటికీ ఇచ్చింది కలిపినా కూడా ఇంత లేదని పేర్కొంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. జగన్ ప్రభుత్వం కొన్ని పత్రికలకు కక్షపూరితంగా ప్రకటనల బకాయిలు నిలిపివేశారనీ చర్చకొచ్చింది. వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత? ఏ ప్రాతిపదికన ఆ పత్రిక కొనుగోలుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది? ఏ నిబంధనల ప్రకారం అన్ని కోట్ల రూపాయల ప్రకటనలు అడ్డగోలుగా జారీ చేసిందన్న అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. 
 
మరోవైపు, గ్రామ, వార్డు వాలంటీర్ల గడువు 2023 ఆగస్టుతోనే ముగిసిందని, జగన్ ప్రభుత్వం వారి సేవల్ని పునరుద్ధరించలేదని మంత్రివర్గం పేర్కొంది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా? కొనసాగిస్తే ఇప్పుడున్నదాన్ని ఎలా క్రమబద్ధీకరించాలి వంటి అంశాల్ని మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చారు. రాజీనామాలు చేయని వాలంటీర్లకు ఎన్డీయే అధికారంలోకి వచ్చాక... జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాలకు వేతనం చెల్లించే అంశాన్ని మంత్రివర్గం ఆమోదం కోసం ఉంచారు. 
 
దానిపై చర్చ సందర్భంగా గత ఆగస్టు నుంచి వారి సేవల్ని పునరుద్ధరించలేదన్న విషయాన్ని అధికారులు మంత్రివర్గం దృష్టికి తెచ్చారు. దీంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, లోతుగా పరిశీలించి, చర్చించాక ఒక నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. జగన్ తప్పుడు విధానాల్లో పరిపాలన సాగించారనడానికి ఇదో నిదర్శనమని పలువురు మంత్రులు ధ్వజమెత్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు