కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో త్వరలోనే సంప్రదాయ భోజనం అందుబాటులోకి రానుంది. గో ఆధారిత సాగుద్వారా పండించిన సరుకులతో ఈ భోజనాన్ని సిద్ధం చేయనున్నారు. ఈ సంప్రదాయ భోజనం మరో రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది. తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుమల, తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమాల్లో వేర్వేరుగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు.
కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సహకారంతో మరో నాలుగు నెలల్లో పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపూ, ధూప్‌స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ తదితర 15 రకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఆలయాల్లో వినియోగించే పుష్పాలతో తయారుచేసిన సుగంధ అగరబత్తీలను సెప్టెంబరు తొలి వారం నుంచి భక్తులకు విక్రయించనున్నట్టు తెలిపారు. కాగా, తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి మరోమారు బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే.