ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ మద్దతుదారులపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. అడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని, అభ్యర్థులకు రక్షణ కావాలని ఎస్‌ఈసీని కోరామని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎస్‌ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడారని, అధికారులను బెదిరించిన పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో దుస్థితిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి కూడా వివరాలు పంపుతున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో అధికారులు.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని, చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎస్‌ఈసీదే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు వినుకొండ, మాచర్లలో అదనపు భద్రతా బలగాలను అందించాలి. ఎలక్షన్ కమిషన్ వెంటనే తగిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మాచర్ల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను భక్తవత్సలరెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారు.
నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే తప్పుడు కేసులతో వేధిస్తామంటూ బెదిరిస్తున్నారు. మాచర్ల పరిధిలో 77 పంచాయతీలకుగాను, 72 పంచాయతీలు ఏకగ్రీవం చేశారు. మిగిలిన వాటిల్లో అభ్యర్థులను వేధిస్తున్నారు" అని వెల్లడించారు.