'స్థానిక సమరం' ఖాయం.. ఎస్ఈసీ :: కుదరదంటే కుదరదు.. ఏపీ సర్కారు

బుధవారం, 18 నవంబరు 2020 (11:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం, అటు రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి రాజ్యాంగ వ్యవస్థ. మరొకటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. ఈ రెండు వ్యవస్థలూ ఇపుడు మరోమారు తలపడుతున్నాయి. స్థానిక ఎన్నికల అంశంలో ఈ రెండు ఢీ అంటే ఢీ అంటున్నాయి. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమని ప్రకటించారు. పైగా, ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌, ఇతర వివరాలను ఈసీ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. 
 
ఇక్కడే ప్రభుత్వానికి కాలింది. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదనీ, ఇప్పటికే ఆరు వేల మందికిపైగా ప్రజలు చనిపోయారని, ఎన్నికలు నిర్వహిస్తే మరికొంతమంది చనిపోతారని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వాదిస్తోంది. ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ ఎస్ఈసీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ లేఖ రాశారు. 
 
దీనికి ఎస్ఈసీ కూడా ఘాటుగానే మొబైల్‌లో సమాధానమిచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేస్తోందని, ఈసీ స్వయంప్రతిపత్తిగల వ్యవస్థ అని, అందులో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని గుర్తుచేసింది. పైగా, ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్న న్యాయధికారాలను ప్రశ్నిస్తారా? అంటూ నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఫోన్ సందేశంలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు