గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య, ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు సోమవారం తెలిపారు.
పంచాయతిరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌కు సమ్మెనోటీసు అందజేశామన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లను గ్రామ సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు.
పీఎఫ్, ఈఎ్‌సఐ సౌకర్యాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు 1999లోనే జీఓ 551 ద్వారా గుర్తింపుకార్డులు, పీఎఫ్, ఈఎ్‌సఐ సౌకర్యాలు కల్పించాలని ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
పార్ట్‌టైమర్స్‌కు టైంస్కేల్ అమలు చేయాలని ఇచ్చిన జీఓ అమలుకు నోచుకోలేదన్నారు. ముందు నుంచి ఉద్యోగాల్లో ఉన్న వారిని కొనసాగించాలని 2015లో హైకోర్టు తీర్పునిచ్చినా.. కృష్ణా, నెల్లూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల పంచాయతీ అధికారులు అమలు చేయడం లేదన్నారు.
జగన్ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలోనే పారిశుధ్య కార్మికులకు రూ.18 వేల వేతనం ఇస్తామని తీర్మానించినా ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. దీంతో కార్మికులు మనస్థాపానికి గురయ్యారని ఈ నేపథ్యంలోనే ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించామన్నారు.