దొంగ చేతికే తాళం?... దుర్గ గుడిలో చోద్యం!

మంగళవారం, 22 అక్టోబరు 2019 (08:15 IST)
దొంగ చేతికి తాళం ఇవ్వడం అనే సామెతను మనం చాలాసార్లు విని వుంటాం. ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అధికారులకు ఈ సామెత ఎలా అర్థమైందోగానీ... అచ్చం దానిని పాటించి చూపించారు. ఈ ఏడాది జనవరి ఒకటిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి గౌరవసూచకంగా ఆలయ అధికారులు అమ్మవారి పట్టు చీరలు అందించాలని భావించారు.

గోడౌన్‌ నుంచి తెప్పించి అందజేసే సమయానికి ఖరీదైన పట్టుచీరల స్థానంలో నాసిరకం చీరలున్నాయి. వాటిని చూసి అవాక్కయిన అప్పటి ఈవో కోటేశ్వరమ్మ వాటిని పక్కనబెట్టించి మళ్లీ పట్టుచీరలను తెప్పించి జడ్జిలకు అందజేశారు. విచారణ అనంతరం ఆలయంలో అప్పుడు విధుల్లో ఉన్న మహిళా సూపరింటెండెంటు ఖరీదైన పట్టుచీరలను మాయం చేసి.. వాటి స్థానంలో నాసిరకం చీరలను ఉంచిన దృశ్యాలు సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డయ్యాయి.

ఆ తర్వాత ఆ చీరలను మాయం చేసిన మహిళా సూపరింటెండెంట్‌ చేత అమ్మవారి అన్నదానానికి రూ.30 వేలు కట్టించారు. తర్వాత ఆమెను ప్రధాన ఆలయం నుంచి వేరే సెక్షన్‌కు బదిలీ చేశారు. కట్‌ చేస్తే.. ఆనాడు పట్టు చీరలను మాయం చేసిన ఆ మహిళా అధికారి ప్రస్తుతం అమ్మవారి చీరల విభాగానికి పర్యవేక్షణాధికారిగా నియమించారు.

‘ఇదేం చోద్యం?’’ అంటూ దేవస్థానం ఉద్యోగులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దాదాపు 600 మందికి పైగా శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు అంగ, అర్థబలంతోపాటు రాజకీయ పలుకుబడి ఉన్న ఉద్యోగులు కోటరీలుగా ఏర్పడి కొండపై తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు.

ఇంద్రకీలాద్రి కొండపై అక్రమ ఆదాయం బాగా వచ్చే స్థానాల్లో తిష్టవేసేందుకు ఈ కోటరీలు పోటీలు పడుతుంటాయి. తమ అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను వారికి నచ్చినచోట పోస్టింగులు ఇప్పించుకునేందుకు ఈ కోటరీలు కొట్లాడుకుంటుంటాయి.
 
ఈ క్రమంలో కోటరీలకు అనుకూలురైన ఉద్యోగులు అనర్హులైనా ఆదాయం వచ్చే సీటులో తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయం వచ్చే సీట్ల కోసం కొట్లాడుకుంటున్న దేవస్థానం ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి రాజకీయపార్టీలకు అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి ఆ పార్టీకి అనుబంధంగా ఉండే కోటరీలు కొండపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.
 
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేవస్థానం ఉన్నతాధికారులు కూడా ఈ కోటరీల నాయకులు చెప్పిందల్లా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాజకీయ ఒత్తిళ్లతో ప్రత్యర్థి కోటరీలకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం దుర్గగుడిలోని చీరల విభాగంలో కొనసాగుతున్న దేవాదాయశాఖ కమిషనర్‌ తనిఖీల వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
 
దుర్గగుడిలోని కీలకమైన చీరల విభాగంలో దేవాదాయశాఖ కమిషనర్‌ మొవ్వ పద్మ శనివారం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు వి.కోటేశ్వరమ్మ ఈవోగా పని చేసిన ఏడాది కాలంలో కమిషనర్‌ ఒక్కసారి కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు.

శని, ఆదివారాల్లో చీరల విభాగంలో కమిషనర్‌ పద్మ, దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబుల ఆధ్వర్యంలో సిబ్బంది చీరల విభాగంలో తనిఖీలు నిర్వహించారు. తక్కువ రకం చీరలకు అధిక ధరల స్టిక్కర్లు అతికించి సుమారు రూ.11.60 లక్షల విలువైన ఖరీదైన చీరలను పక్కదారి పట్టించినట్టుగా తనిఖీల్లో బయటపడిందని చెబుతున్నారు.

చీరల కౌంటరులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం బాధ్యుడని తేల్చి.. ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఈవో సురేష్‌బాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది దసరా ఉత్సవాల నుంచి ఈ ఏడాది దసరా ఉత్సవాల ముందు వరకు 14 నెలలపాటు చీరల విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సుబ్రహ్మణ్యం.. ఇంతకుముందు పని చేసిన ఈవో కోటేశ్వరమ్మకు సీసీగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

ఆమె స్థానంలో ఈవోగా వచ్చిన ఎం.వి.సురేష్‌బాబు బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే సుబ్రహ్మణ్యంను సీసీ బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత చీరల విభాగంలో స్టాకు అప్పగించి.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. దాంతో గత నెల 28వ తేదీ నాటికి చీరల విభాగంలో ఉన్న స్టాకును అప్పగించేశారు.

తాజాగా దేవాదాయశాఖ కమిషనర్‌ దేవస్థానానికి వచ్చి ప్రత్యేకంగా చీరల కౌంటరులో తనిఖీలు నిర్వహించడం వెనుక కొండపైనున్న కోటరీల ప్రమేయంతోపాటు రాజకీయ ఒత్తిళ్లున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చీరల కౌంటరులో అక్రమాలకు బాధ్యుడిగా జూనియర్‌ అసిస్టెంట్‌ను మాత్రమే సస్పెండ్‌ చేసి.. అతనిపై పర్యవేక్షణాధికారులుగా ఉన్న సూపరింటెండెంట్‌, ఏఈవోలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు