ద‌ళిత బాలిక‌పై హ‌త్యాచారం చేసిన వాడిని ఉరితీయాలి

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:01 IST)
సీఎం కెసిఆర్ ఖబడ్దార్.... తరాలు మారినా ఆడ బిడ్డల తలరాతలు మారడం లేదు... గిరిజన ఆడబిడ్డల పై అత్యాచారాలు ఆపకుంటే, తెలంగాణ తగలబడుతుంది...అంటూ ద‌ళితులు ఉద్య‌మించారు. అభం శుభం తెలియని గిరిజన బాలికపై జరిగిన అఘయత్యానికి నిరసనగా గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో  భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ నిర‌స‌న ర్యాలీకి భారీగా మహిళా సంఘాలు, విద్యార్థి నాయకులు త‌రలివచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బాలికపై అఘయత్యానికి పాల్పడిన నిందితుడిని ధర్మ దేవత సాక్షిగా వెంటనే ఉరితీయాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక గిరి నాథ్ సెంటర్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు విద్యార్థినులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీకి మద్దతుగా నంద్యాల వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, అభం శుభం తెలియని ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
 
అత్యాచారం జరిగి రోజులు గ‌డుస్తున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం అన్నారు. సభ్యసమాజం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, ప్రియాంక రెడ్డి ఘటనకు స్పందించిన సీఎం కెసిఆర్  గిరిజన బాలికపై ఎందుకు శ్రద్ధ చూపించడం లేదని మండిపడ్డారు. అగ్రవర్ణ కులాలకు ఒక న్యాయం, దళిత గిరిజనులకు ఒక న్యాయమా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. బాలిక కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కెసిఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చ‌రించారు. 
 
ఇంతవరకు గిరిజన బాలికపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడమే కాకుండా  వారి కుటుంబానికి ఇంత వరకు పరామర్శించడానికి కూడా ఒక మంత్రి గానీ, ఎమ్మెల్యే గాని ఇంతవరకూ వెళ్లకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ విజయ్ నాయక్, గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్, మరియు గిరిజన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు