నయీం కేసులో కొనసాగుతున్న అరెస్ట్‌లు: 24మంది హతం.. వైద్యులే తప్పుడు రిపోర్టులిచ్చారు

మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (10:02 IST)
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. పలువురు నయీం అనుచరులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.  కాగా నయీం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అతని గురించిన ఎన్నో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తం వివరాలను రాబట్టే పనిలో సిట్ పడింది. ఇప్పటి వరకు నయీం చేతిలో 24మంది హతమారినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇలా హత్య చేసిన వాటిలో కొన్ని హత్యలను పథకం ప్రకారం ప్లాన్ చేసి సహజ మరణాలుగా చిత్రీకరించారు. అయితే దీనికి ప్రభుత్వ వైద్యులే తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు సిట్ విచారణలో తేటతెల్లమైంది. 
 
ప్రస్తుతం నయీం కేసులపై సిట్ చేస్తున్న దర్యాప్తులో ఈ అంశాలు వెలుగుచూశాయి. అయితే ఇప్పటివరకు పోలీస్, పొలిటికల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మీడియా విభాగాలతో నయీమ్‌కు సంబంధాలున్నట్టు సిట్ విచారణలో తేలింది. దాదాపు నాలుగు మృతదేహాలకు వైద్యులు తప్పుడు పోస్ట్మార్టం నివేదికలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తప్పుడు నివేదికలు ఇచ్చిన వైద్యులను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం అవుతోంది. త్వరలో వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. అలాగే నయీం కేసులో ఇప్పటివరకూ 99కేసులో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ లభించిన డాక్యుమెంట్లు, కీలక ఆధారాలను నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు.
 
 ఇక భూకబ్జాలకు సంబంధించి నయీంకు సహకరించిన అధికారుల వివరాల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీజీకి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు ఈ కేసు దర్యాప్తును సిట్ ముగించనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడిన అతడి అనుచరులు హత్యల వివరాలను వెల్లడిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి