నిమ్మగడ్డపై చర్యలకు ఏపీ స్పీకర్ చర్యలు... ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు...

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైకాపా మంత్రులు కత్తికట్టారు. ఆయన్ను ఏదో విధంగా చిక్కుల్లో పడేలా కుయుక్తులు పన్నుతున్నారు. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇచ్చారు.
 
ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని తమ నోటీసుల్లో వారు పేర్కొన్నారు. నిమ్మగడ్డ ఆయన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ఈ నోటీసులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఎస్ఈసీపై చర్యలకు ఉపక్రమించారు. ఈ నోటీసులను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. దీంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. తమ్మినేని చర్యతో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
మరోవైపు, ఎస్ఈసీపై చర్యలు తీసుకునే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉందా? అనే చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ ఆ అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉన్నట్టయితే... నిమ్మగడ్డపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు