ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, చతుర్దశకలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, యజమాని సంకల్పం, స్వామివారికి వస్త్ర సమర్పణ, లక్ష్మీ ప్రతిమ పూజ, స్వామివారికి కిరిట సమర్పణ చేశారు. తరువాత ప్రధాన హోమం, పూర్ణాహూతి, సీతమ్మవారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయస్వామివారికి రాములవారి నగలను బహూకరించారు.
అనంతరం నివేదన, హారతి, చతుర్వేద పారాయణం, మహా మంగళహారతి, యజమానికి వేద ఆశీర్వాదం చేశారు. శ్రీరామపట్టాభిషేకం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.