విశాఖపట్టణంలో తి. తి. దే. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 14వ తేదీన శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జెఈవో పి.బసంత్ కుమార్ తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు.
ఇదే స్థాయిలో విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. వేదిక మీద వెయ్యి దీపాల నడుమ శ్రీవారి ఉయ్యాల సేవ, స్వామివారికి అభిముఖంగా శ్రీ సూక్తంయాగం నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
భక్తిగీతాలాపన, అష్టలక్ష్మీ వైభవం నృత్యం, సామూహిక లక్ష్మీనీరాజనం(దీపాలు వెలిగించడం)తో పాటు కుంభ హారతి, నక్షత్ర హారతి, మంగళహారతి నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. అధికారుల బృందం విశాఖకు వెళ్లి కార్యక్రమ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని త్వరితగతిన నిర్ణయించాలన్నారు.
ఈ సమీక్షలో జెఈవో(ఆరోగ్యం, విద్య) సదా భార్గవి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి గోపాల్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కల్యాణ వేంకటరమణస్వామివారి ఆలయాన్నిడిసెంబరు 5వ తేదీ ఉదయం 11.26 నుండి 12.26 గంటల మధ్య టిటిడిలోకి విలీనం చేసుకోనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను టిటిడి అధికారులకు అందజేస్తారు.