వింత వ్యాధి ఏలూరు జిల్లాను వీడడం లేదు. ఏలూరు తరహా వింత వ్యాధి.. ఇప్పుడు పూళ్ల వాసులను భయపెడుతోంది. వరసగా మూడో రోజు మంగళవారం సాయంత్రం వరకు మరో ఎనిమిది మంది ఈ వ్యాధి భారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27కు చేరింది. ఇందులో 22 మంది రికవరీ కాగా, ఒకరిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మిగిలిన వారు పూళ్ల పీహెచ్‌సీలో వైద్యం అందిస్తున్నారు. నిల్చున్న వారు నిల్చున్నచోటనే కుప్పకూలారు. స్పృహ కోల్పోవడం, మూర్చతో నురగలు కక్కుతూ కింద పడి కొట్టుకోవడం కనిపిస్తోంది. గ్రామంలో మరో ఎనిమిది మందికి వింత వ్యాధి సోకడంతో కేసుల సంఖ్య 26కు చేరింది. వీరిలో 21 మంది రికవరీ కాగా, కొత్తపేటకు చెందిన తొంటా రంగా తలకు గాయం కావడంతో ఏలూరు తరలించామని పీహెచ్‌సీ డాక్టర్ లీలా ప్రసాద్ తెలిపారు.
మంత్రి ఆళ్ల నాని, జిల్లా అధికారులు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలిస్తుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మాధురి అనే ఆశ వర్కర్ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు ఫిట్స్ వచ్చాయేమోనని అంతా భావించారు. ఉదయం నుంచి ఆహారం ఏమీ తీసుకోకపోవడం వల్ల నీరసంతో సొమ్మ సిల్లినట్లు ఆమె చెప్పారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఏలూరు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ఇంటింటా సర్వే చేస్తోంది. ఎపిడమిక్ సెక్షన్ ఇన్‌ఛార్జులు డాక్టర్ చక్రధర్, శ్రీలక్ష్మితో పాటు 20 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. కాలనీ వాసుల్లో కొత్తగా వ్యాధి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటూ పరిసరాల శుభ్రత, తాగునీటి వాడకంపై జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు. ఐదు కాలనీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఐదు ఫీల్డ్ బృందాలను నిర్వహించారు.
పూళ్ల ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దు. ప్రజల ఆరోగ్యం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. పూళ్లలో ప్రజ లు ఏలూరు తరహాలో అస్వస్థతకు గురవుతున్నారని ఎమ్మెల్యే వాసు బాబు నా దృష్టికి తేవడంతో అధికారులను అప్రమత్తం చేశాం. వ్యాధిగ్రస్తులంతా గంటలోపే రికవరీ అయ్యారు. ఎవరికి ప్రాణా పాయం లేదు. మెరుగైన సౌకర్యాల కోసం స్థానిక పీహెచ్‌సీలో అదనంగా బెడ్లు ఏర్పాటు చేస్తున్నాం.
ఏలూరు నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశాం. వారు ఇంటింటి సర్వే చేస్తున్నారు. గ్రామంలో ఐదుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. అస్వస్థతకు కారణాలు తెలుసుకునేందుకు అన్ని రకాల శాంపిల్స్‌ను తీసుకుంటు న్నాం. వ్యాధిని నిపుణులు నిర్ధారిస్తారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.