వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత అపెక్స్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుధీర్ఘంగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
తన తండ్రి హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్రమంగా జరగడం లేదని, కొందరు సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దర్యాప్తు అధికారులపై ప్రైవేట్ కేసులు పెడుతున్నారని, అందువల్ల సీబీఐ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దాదాపు మూడు గంటల పాటు విచారించింది.
అదేసమయంలో వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని సుప్రింకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్‌ను సీబీఐ దాఖలు చేసింది. విచారణను వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలనే బలమైన కారణాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది. దీంతో ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అపెక్స్ కోర్టు పచ్చజెండా ఊపింది. అయితే, ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపై శుక్రవారం తుది తీర్పును వెలువరించనుంది.