తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను ఎంత కాలంలోగా తేల్చేస్తారో చెప్పాలని ఆదేశించింది. వచ్చే నెల 8వ తేదీలోగా కోర్టుకు తెలపాలని సూచించింది. పార్టీ మారిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ చీఫ్ విప్, ఎమ్మెల్యే సంపతకుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చేశారు.
జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ముందుగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదిస్తూ అధికార పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని 2014 ఆగస్టు నెలలో స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చామని, రెండున్నరేళ్లు గడిచినా స్పీకర్ వాటిని పరిష్కరించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
2015లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన దస్తీ నోటీసులను పిటిషనర్ స్వయంగా ప్రతివాదులకు అందించారని గుర్తుచేశారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. స్పీకర్ వద్ద పెండింగ్‌లో అనర్హత పిటిషన్లను పరిష్కరించడానికి ఎంత కాలం కావాలో వచ్చే నెల 8వ తేదీలోగా కోర్టుకు చెప్పాలని తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం నవంబరు 8వ తేదీకి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.