వైఎస్.వివేకా హత్య కేసులో ట్విస్ట్ : అనుమానితుడి ఆత్మహత్య

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (15:39 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును విచారిస్తున్న సీఐ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని భార్య ఆరోపిస్తోంది. 
 
వైఎస్ వివేకానంద రెడ్డి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్య కేసు వెనుక ఉన్న మిస్టరీని ఇప్పటివరకు ఛేదించలేకపోతున్నారు. ముఖ్యంగా, ఎవరు హత్య చేశారన్న విషయంలో పోలీసులకు ఇంతవరకు స్పష్టమైన క్లూ లభించలేదు. 
 
ఈ పరిస్థితుల్లో కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరులో నిద్రమాత్రలు మింగిన శ్రీనివాసులు.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని సూసైడ్‌ నోట్‌లో శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భాస్కర రెడ్డిలకు శ్రీనివాసుల రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశాడు. 
 
ఇప్పటికే కాల్‌ డేటా ఆధారంగా శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు పలుమార్లు విచారించారు. వైఎస్‌ వివేకా కుటుంబానికి గత 30 ఏళ్లుగా సేవ చేస్తున్నామని, ఈ కేసుతో తనకు, తన బావ శ్రీనివాసులు రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మరో అనుమానితుడు పరమేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకోవైపు, శ్రీనివాసుల రెడ్డిని సీఐ రాములు తీవ్రంగా వేధించినట్టు కుటుంబసభ్యులు ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు