తన కష్టాన్ని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గుర్తించారనీ, అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగానే తనకు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్యనటుడు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పేరుతో మంచి గుర్తింపు పొందిన పృథ్వీ చెప్పుకొచ్చారు.
ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తనకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్ పదవి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభవాలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు.
ఇకపోతే, తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ వైకాపా అని చెప్పారు. తొమ్మిదేళ్ళ పాటు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డానని, ఓ సామాన్య కార్యకర్తగా పని చేశానని చెప్పారు. అది జగన్ గుర్తించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎన్నో మొక్కులు మొక్కానని, తిరుమలలో రాజకీయాలు మాట్లానని, అమరావతిలోనే మాట్లాడుతానని చెప్పారు. ఇకపోతే, సహ నటుడు పోసాని కృష్ణమురళితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.