తిరుపతి శ్రీవారి మెట్టులోని దట్టమైన శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వారి నుంచి 49 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒక తమిళ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు.
టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలు మేరకు ఆర్ ఎస్ ఐ వాసు, డీఆర్వో నరసింహ రావు శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్రీవారి మెట్టు నుంచి కూంబింగ్ చేపట్టారు. దాదాపు 800 మీటర్ల ఎత్తు, బండ రాళ్లను దాటుకుంటూ కూంబింగ్ చేపట్టారు. శనివారం ఉదయం 1.30 ప్రాంతంలో 50 మందికి పైగా స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలతో తారసపడ్డారు.
శ్రీవారి మెట్టు మెట్ల మార్గం లోని మెట్ల నుంచి అడవిలో మూడు కిలోమీటర్ల వద్ద దుంగలను పడేసి వెళ్లడంతో, ఆ ప్రాంతానికి అధికారులు చేరుకున్నారు. దాదాపు 700 మీటర్ల ఎత్తు నుంచి వదిలి వెళ్ళిన దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది మోసుకుని వచ్చారు.
సంఘటన స్థలానికి డీఎస్పీలు వెంకటయ్య, గిరిధర్, సిఐలు సుబ్రహ్మణ్యం, వెంకట్ రవి, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ చేరుకున్నారు. దుంగలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. అరెస్టు కాబడిన ముద్దాయిని విచారించి, మిగిలిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.