రామసుబ్బారెడ్డి సౌమ్యుడే.. కానీ అనుచరులో.. సిఎం రమేష్ బాగానే రుచి చూశారు

శనివారం, 8 ఏప్రియల్ 2017 (03:50 IST)
పసలేని ఆశలు చూపంచి నట్టేట ముంచితే  ఆ జనాగ్రహం ఎలా ఉంటుందో తెలుగు దేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు బాగానే అర్థమైంది. ఎందుకంటే ఆయనమీదకి అసమ్మతి కుర్చీలు బాగానే ఎగిరాయి. ముప్పైఏళ్లుగా పార్టీకి వైఎస్సార్ జిల్లాలో మూలస్తంభంగా ఉన్న అతి విధేయుడు, పరమసౌమ్యుడు, టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డికి చివరి వరకు మాట ఇచ్చి  మంత్రివర్గ విస్తరణలో సీటు ఖాయం అని నమ్మబలికి తీరా అయన ప్రత్యర్థి, నిన్నకాక మొన్న వైఎస్సార్ సీపీ నుంచి గెంతేసిన జంప్ జిలానీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. 
 
తమ నాయకుడికి నమ్మక ద్రోహం తలపెట్టిన నాయకుడు ఎవడైనా సరే కనిపిస్తే తడాఖా చూపాలని అనుకుంటున్న రామసుబ్బారెడ్డి అనుయాయులకు మొదటగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేషే దొరికిపోయాడు. కోరి కోష్టాలను తెచ్చుకోవడం అంటే ఇదేనని సీఎం రమేష్‌కి బాగా అర్థం చేయించారు జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తలు. 
 
అసలే బాధలో ఉన్నారు. నాయకుడిని నట్టేట ముంచారని ఆగ్రహంతో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యకర్తలతో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులా సమావేశమయ్యారు. కార్యక్రమం సాగుతుండగా పిలవని పేరంటంలా సీఎం  రమేష్ అక్కడికి చేరుకున్నారు. అంతే. టీడీపీ కార్యకర్తలు బద్ధశత్రువును చూసినట్లుగా రెచ్చిపోయారు. తాము కూర్చున్న కుర్చీలను అమాంతంగా లేపి సీఎం రమేష్‌పై విసిరేశారు. కొందరయితే దొరికితే చావబాదాలన్నంత కోపంతో ఊగిపోతూ రమేష్ ఉన్నవైపు దూసుకుపోయారు. ఈలోగా గాల్లోకి లేచిన కుర్చీలు రమేష్‌కు అడ్డుగా నిలిచన గన్‌మెన్లకు తగిలాయి. ప్రమాదం పసిగట్టిన రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి పి. శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ అడ్డుపడి కార్యకర్తలను శాంతింపచేశారు.
 
వైఎస్సార్ జిల్లా రాజకీయాలలో చేయి పెట్టిన తెదేపా నేత సీఎం రమేష్‌కు సొంత పార్టీ కార్యకర్తలతోటే కొట్టించుకు్న అనుభవం ఇదే తొలిసారి. ముందుగా అలా లేచిన కుర్చీలను చూసి బిత్తర పోయినా తర్వాత తమాయించుకున్నారు. మరి నాయకులు రాజకీయాలను ఒకలా సాగిస్తే, కార్యకర్తలు మరొకలా సాగిస్తారు. 
 

వెబ్దునియా పై చదవండి