ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేరుకోలేని షాకివ్వనున్నారు. భారతీయ జనతా పార్టీ మిత్రక్షంగా, ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మెల్లగా దూరం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంచలంచెల పోరాటంలో భాగంగా, ఏకంగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఇందులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తొలుత కేంద్ర మంత్రి పదవులకు టీడీపీ మంత్రులు రాజీనామా చేసే అవకాశముంది. అప్పటికీ ఫలితం రాకపోతే బీజేపీతో కటీఫ్ చెప్పి, ఎన్డీయే నుంచి వైదొలిగేదాకా వెళ్లవచ్చునని తెలుస్తోంది.
ఇదే అంశంపై పార్టీ నేతలతో చంద్రబాబు స్పందిస్తూ, 'రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రానికి పదేపదే విన్నవిస్తున్నాం. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయినా న్యాయం జరగకపోతే అంచెలంచెలుగా ముందుకు వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదు' అని వ్యాఖ్యానించారు.