దొరికిపోయిన దొంగల్లా టీడీపీ, బీజేపీ : అంబటి రాంబాబు

శనివారం, 16 జనవరి 2021 (19:00 IST)
రాష్ట్రంలో గత కొంతకాలంగా దేవతా విగ్రహాలను విరగకొట్టే దుస్సంఘటనలు, దేవాలయాలపై చీకట్లో దాడులు జరుగుతూ వచ్చాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. ఈ ఘటనలపై కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఛానల్స్‌ ... కొన్ని అవాస్తవాలను వాస్తవాలుగా చీత్రీకరించే ప్రయత్నం చేశాయని అన్నారు.

కొన్ని చోట్ల దాడులు జరగటం, విగ్రహాలను అవమానించటం, విగ్రహాలను విరిచి వేయటం వంటి సంఘటనలు జరిగాయన్నారు. అయితే జరగని సంఘటనలు కూడా జరుగుతున్నట్లుగా చూపించి, రాష్ట్రంలో ఒక గందరగోళం సృష్టించటానికి కొన్ని పత్రికలు, కొన్ని శక్తులు ప్రయత్నం చేసినట్లుగా మనకు అర్థమౌతోందని అంబటి అన్నారు.

ఇటువంటి చర్యల ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం కొన్ని దుష్టశక్తులు చేశాయి. శ్రీ జగన్ గారిని, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న కుట్ర బుద్ధితో ఇటువంటి ప్రయత్నాలు చేశారని అంబటి తెలిపారు.
 
అధికారంలోకి రాలేమనే మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటారా?
రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన ఘనత శ్రీ జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని అంబటి అన్నారు. తిరిగి అధికారంలోకి రాలేనని భావించిన చంద్రబాబు మొన్నటి వరకు కులాన్ని, ప్రాంతాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయం చేశారని,  ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టి పోయిన అధికారాన్ని దక్కించుకోవాలనే విషప్రయత్నం చంద్రబాబు చేస్తూ వచ్చారని, ఇది చాలా దురదృష్టకరమైన పరిణామంగా భావిస్తున్నామని అంబటి అన్నారు. 
 
నిజం చెప్పాలంటే ఈ 13 జిల్లాలు కలిపిన రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఎక్కడా మతాల మధ్య ఎప్పుడూ గొడవలు లేవని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కొంత మతవిద్వేషాలు అప్పడప్పుడు రగిలేవి తప్ప,  ఈ ప్రాంతంలో మతాల మధ్య సామరస్యమే తప్ప మతాల మధ్య ఘర్షణ ఎప్పుడూ లేదని అంబటి గుర్తు చేశారు.
 
డీజీపీ వాస్తవాలు చెప్పేసరికి టీడీపీ, బీజేపీల గొంతులో వెలక్కాయ పడింది
చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ తాబేదార్ల ప్రకటనలతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ వచ్చారు తప్ప ఏనాడూ ద్వేషించుకున్నది లేదని అంబటి అన్నారు. అలాంటి ఈ పవిత్రమైన రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టాలనే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నానని అంబటి తెలిపారు.

పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ ద్వారా తెల్సిన వాస్తవాలను డీజీపీ చెప్పే ప్రయత్నం చేశారు. దీని తర్వాత టీడీపీ, బీజేపీ గొంతులో వెలక్కాయ పడినట్లు అయిందని, అందుకే ఏం మాట్లాడాలో వారికి అర్థం కాని పరిస్థితి వచ్చిందని అంబటి అన్నారు. 44 కేసులు ఇన్వెస్టిగేషన్‌ చేస్తే 29 కేసుల్లో వాస్తవాలను గ్రహించే అవకాశం పోలీసులకు కలిగిందని అంబటి అన్నారు. దీంట్లో టీడీపీ, బీజేపీ వారు కలిసి చేశారనే భావన వచ్చే విధంగా వాస్తవాలు బయటకు వచ్చాయని అంబటి అన్నారు. 

చీకట్లో జరిగిన ప్రతి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దొరికిపోయిన దొంగల్లా ఆ పార్టీలు భుజాలు తడుముకుంటున్నాయి. నిన్నా, ఈరోజు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, వారి తాబేదార్లు ఇస్తున్న స్టేట్‌మెంట్స్ చూస్తుంటే వారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని తెలుస్తోంది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితికి వారు రావటం జరిగిందని అంబటి అన్నారు. పైగా డీజీపీ మీద వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డీజీపీ మాట మారుస్తున్నారని.. డీజీపీ వైయస్‌ఆర్‌సీపీ నాయకుడులా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేయటం సరికాదని అంబటి అన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటానికి డీజీపీ, పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తుంటే వారి (టీడీపీ, బీజేపీ నేతల) బండారం బయట పడుతుందని భయపడుతున్నారని అంబటి అన్నారు.
 
రాజకీయాల్లో రాజకీయం చేసుకోండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని అంబటి అన్నారు. మా మీద గెలవటానికి ప్రయత్నించండి. రాజకీయంగా విమర్శలు చేయమనండి కానీ మతాన్ని అడ్డంపెట్టుకొని వైయస్‌ఆర్‌సీపీని, వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే సహించేది లేదని అంబటి తెలిపారు. మత సామరస్యానికి విఘాతం కల్పించే శక్తి ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ మతమైనా ఉక్కుపాదంతో అణచివేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అలాంటి వాటిని సహించేది లేదని అంబటి స్పష్టం చేశారు. 
 
మతాలు, కులాలతో రాజకీయం చేస్తే తరిమితరిమి కొడతాం
మతాలను, కులాలను రెచ్చగొట్టి రాజకీయం చేసే వారిని ఈ రాష్ట్రంలో తరమితరిమి కొడతామని అంబటి హెచ్చరించారు. మతం, కులం, ప్రాంతం లేదు అందరూ సామరస్యంగా జీవించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం, ఈ పార్టీ ఉద్దేశ్యం. వయస్సులో పెద్దవారు, సీనియర్‌ రాజకీయవేత్త అని చెప్పుకునే  చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారు. క్రిస్టియన్ల గురించి, హిందువుల గురించి బాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబు హిందువుల ప్రతినిధిగా మాట్లాడటం ఏంటని అంబటి ప్రశ్నించారు. హిందుత్వం మీద చంద్రబాబుకు నమ్మకం ఉందా? హిందువుగా చంద్రబాబు పుట్టారు. బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబుకు హిందుత్వం మీద నమ్మకం, విశ్వాసం ఉన్నదా అని అంబటి ప్రశ్నించారు. గోపూజ చేస్తేనో, పురాణాలు చదివితేనో, పంచాంగ శ్రవణాలు వింటేనో భక్తి కాదు. దేవుడి మీద నమ్మకం, పవిత్ర భావన ఉండాలని అంబటి అన్నారు. బూట్లతో అనేకసార్లు పూజ చేసిన చంద్రబాబుకు తన వర్గం మీద ప్రేమ తప్ప మతం మీద ప్రేమే లేదని అంబటి అన్నారు. ఇది వాస్తవమని, ప్రజలంతా గమనిస్తున్నారని అంబటి తెలిపారు.
 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మతం, కులం, ప్రాంతం లేదు
నాకు మతం ఉంది. మీకు మతం ఉంది. జగన్ మోహన్ రెడ్డికి మతం ఉంది. కానీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మతం లేదు. 50% ఓట్లతో 86% సీట్లతో (151 సీట్లు) గెలుచుకొని అధికారంలోకి వచ్చిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మతమే లేదు. కులమే లేదు. ప్రాంతీయమే లేదని గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను. మా మేనిఫెస్టోను ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీతలా భావించాము. మేనిఫెస్టోలో 95% వాగ్దానాలను 20 నెలల్లో నెరవేర్చిన ఈ ప్రభుత్వానికి మతం, కులం, ప్రాంతీయమే లేదు. మానవులు అందరూ సమానంగా ఉండాలన్న భావన తప్ప ఇంకొకటి లేదన్నారు.

కోవిడ్ విపత్కర సమయంలోనూ కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదని అంబటి గుర్తు చేశారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించినటువంటి ఈ ప్రభుత్వానికి మతం ఎక్కడుంటుందని అంబటి ప్రశ్నించారు. మేం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని అంబటి తెలిపారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఇలా అన్ని మతాల వారికి సమానంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి మతం ఎక్కడుంటుందని అంబటి అన్నారు. మతం పేరు చెప్పి ఏదో ఒక విధంగా ఓట్లు సంపాదించాలనుకునేది దుష్టశక్తులే తప్ప మరొకరు కాదని అంబటి తెలిపారు. 
 
ఇవాళ ఈ దేవాలయాల మీద, హిందుత్వం మీద చీకట్లో రహస్యంగా దాడి చేసి వైయస్‌ఆర్‌సీపీపై మోపాలని టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసి బెదిరించి అరెస్టైంది. దానిమీద చంద్రబాబు, టీడీపీ మాట్లాడరేంటి? అది పట్టపగలు జరిగిందనా? లేదా రామతీర్థంలోనో మరోచోటనో రథం కాలిపోతేనో విగ్రహాలు ధ్వంసం చీకట్లో జరిగితే వైయస్‌ఆర్‌సీపీపై నిందలు వేస్తూ మాట్లాడతారా? ఎందుకు అఖిలప్రియ అంశంలో మాట్లాడరని అంబటి ప్రశ్నించారు. 

మతం ద్వారా కుట్ర చేసి రాజకీయాల్లో మెప్పు పొంది ప్రజల్లో చీలికలు తెచ్చి వైయస్‌ఆర్‌సీపీకి నష్టం చేయాలని అనుకోవటం అనేది సరైన విధానం కాదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా పరిపాలన చేసే ప్రభుత్వం ఇదని మరొక్కసారి చెబుతున్నామని అంబటి అన్నారు. కులాలు, మతాలు అడ్డంపెట్టుకొని వైషమ్యాలు సృష్టించే ఏ శక్తినైనా, ఏ రాజకీయ పార్టీని అయినా, ఏ మతం అయినా ఉపేక్షించేది లేదని అంబటి స్పష్టం చేశారు.

అలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఇందులో సందేహమే లేదని అంబటి హెచ్చరించారు. ఏ రాష్ట్రంలో అయినా కుదురుతుందేమో తెలియదు కానీ, ఈ రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చూస్తూ సహించేది లేదని అంబటి మరోసారి హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు