నేను వ్యాక్సిన్ ఇప్పిస్తే మీరు ఉండేది ఎందుకు? చంద్రబాబు ప్రశ్న
సోమవారం, 10 మే 2021 (20:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోమారు విమర్శించారు. నేను వ్యాక్సిన్ ఇప్పిస్తే మీరు వేస్తారా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. అంతేకాకుండా, కేంద్రానికి కేవలం లేఖలు రాయడం వల్ల వ్యాక్సిన్ సరఫరా చేస్తారా? అని ఆయన నిలదీశారు.
సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీరం, భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌లో.. 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే విధంగా కేంద్రం విధానం చేసిందని గుర్తుచేశారు. కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చాయన్నారు.
ఆయా రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల వయసు వారికి ఆయా ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందిస్తున్నాయని తెలిపారు. నేను వ్యాక్సిన్ ఇప్పిస్తే వేస్తామనడం జగన్ దిగజారుడు తనానికి నిదర్శనం. నేను టీకా తెప్పిస్తే మరి మీరెందుకు సీఎంగా ఉండటం? అని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించారు. టీకా కోసం కేటాయించిన రూ.45 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు.
ప్రజల ప్రాణాలంటే జగన్ రెడ్డికి లెక్కలేనితనంగా ఉందన్నారు. ప్రతిపక్షాలపై కుట్రలు ఆపి వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు పెట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో 10 వేల ఎకరాల అసైన్‌మెంట్ భూములను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తెరిచి పేదల ఆకలి బాధ తీర్చాలని తెలిపారు. కరోనా బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 500మందికి పైగా వైద్య సేవలు అందించామని ప్రకటించారు.
కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందిస్తున్నారు. అయితే కొవాగ్జిన్ టీకా డోసులకు విపరీతమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.
డాక్టర్ ఎల్లా, రామోజీ, బాబు.... మీ మధ్య బాంధవ్యాలు, బంధుత్వాలు తెలియనివి కావు... పిచ్చి రాతలు, పిచ్చి కూతలు మాని రాష్ట్రానికి కావాల్సినన్ని కోవాగ్జిన్ డోసులు ఇప్పించండి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అంబటి ట్వీట్ చేశారు. కొవాగ్జిన్ టీకాను డాక్టర్ కృష్ణ ఎల్లాకు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.