మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం రోజుల నుంచి అనారోగ్యంతో భాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతిచెందారు. ఆయనకు ఒక అబ్బాయి... ఒక అమ్మాయి ఉన్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూ అసలుపేరు దేవినేని రాజశేఖర్. విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.