సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమ మైనింగ్ కేసును ఏం చేశారు...

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:17 IST)
నెల్లూరు జిల్లా సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమ మైనింగ్ జ‌రిపిన కేసును ఏం చేశార‌ని, ఎం.శ్రీనివాసులు రెడ్డి స‌న్నాఫ్ రాఘవరెడ్డి ఎవరో తేల్చడానికి ఇంకా తీరిక దొరకలేదా అంటూ, తెలుగుదేశం నాయ‌కులు మండిప‌డుతున్నారు. అక్రమ మైనింగ్ గుట్టు తేల్చి అవినీతికి పాల్పడిన ఇరిగేషన్, పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటారా?  లేదా డాన్ గుట్టు రట్టవుతుందని కేసును నీరుగారుస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.
 
నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ చక్రధరబాబును కలిసి సర్వేపల్లి రిజర్వాయర్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో సంబంధమున్న ఇరిగేషన్ అధికారులు, సహకరించిన అప్పటి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు కోరారు. ఉన్నతాధికారులు స్పందించని పక్షంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 
 
సర్వేపల్లి రిజర్వాయర్ అక్రమ మైనింగ్ వెనుకున్న ఉన్న డాన్ ఆదేశాలతో 24 గంటల్లో అనుమతులు ఇచ్చార‌ని, ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా ఊరుకున్నార‌ని, పోలీసు కేసును నీరుగారుస్తున్నార‌ని విమ‌ర్శించారు. తప్పులు చేసిన అధికారులను కోర్టు మెట్లు ఎక్కించబోతున్నాం..అప్పుడు ఏ డాన్ కాపాడరనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాల‌ని హెచ్చ‌రించారు. 
 
సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా అక్రమాలకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. ఎవరు చెబితే ఇరిగేషన్ ఈఈ క్రిష్ణమోహన్ వచ్చిన దరఖాస్తులను 24 గంటల్లోనే ప్రాసెస్ చేసి ప్రొసిడింగ్స్ ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. 
 
ఆదివారం కూడా పనిచేసి అనుమతులు సిద్ధం చేయడంలో ఈఈ క్రిష్ణమోహన్ కు ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఏంట‌ని నిల‌దీశారు. ఎవరు ఆదేశిస్తే అప్పటికప్పుడే ఆఘమేఘాల మీద అనుమతులు ఇచ్చారో ఇరిగేషన్ అధికారి క్రిష్ణమోహనే చెప్పాల‌న్నారు. ఒకే చేతి రాతతో, వేర్వేరు పేర్లతో ఐదు దరఖాస్తులు వస్తే, ఒక జిల్లా స్థాయి అధికారిగా పరిశీలించకుండా అనుమతులు ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఇరిగేషన్ ఆఫీసులో ఈఈ క్రిష్ణమోహన్ ఎదురుగా కూర్చుని, ఆ దరఖాస్తులను ప్రాసెస్ చేయించిన వ్యక్తి ఎవరో ఆయనే చెప్పాల‌న్నారు. 
 
కంపెనీల పేరుతో దరఖాస్తులను సమర్పించినప్పుడు సంబంధిత వ్యక్తుల ధ్రువ పత్రాలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిట‌ని ప్ర‌శ్నించారు. ఎం.శ్రీనివాసులు రెడ్డి పేరుతో ఉన్న దరఖాస్తులో ఉన్న ఫోన్ నంబర్ ను ట్రూకాలర్ లో డయల్ చేస్తుంటే, గ్రావెల్ సురేష్ అనే పేరు వస్తోంద‌ని, ఆ సురేష్ ఎవరో ఈఈ కృష్ణమోహన్ కి తెలియకుండానే అనుమతులు ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. మైనింగ్ శాఖకు సీనరేజీ  చెల్లించకుండా, ఆ శాఖ అనుమతులు లేకుండా సర్వేపల్లి రిజర్వాయరులో రేయింబవళ్లు టిప్పర్లతో గ్రావెల్ ను తరలించడానికి ఈఈ క్రిష్ణమోహన్ ఎలా అనుమతులు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. 
 
మధ్యాహ్నం 12 గంటల నుంచి లాక్ డౌన్ అమలు జరుగుతున్న సమయంలో గొలగమూడి వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ చెక్ పోస్టు, పోలీసు అవుట్ పోస్టు మీదుగా పదుల సంఖ్యలో టిప్పర్లు అక్రమ రవాణా చేస్తుంటే, అప్పటి ఎస్సై కరిముల్లా ఎందుకు ఊరుకున్నార‌ని, ఆయనకు దక్కిన వాటా ఎంత అని ప్ర‌శ్నించారు. జంగాలపల్లిలో ఒక మహిళా రైతు తన పొలంలో నుంచి తన ఇంటికి మట్టి తోలుకుంటుంటే పోలీసులకు ఫిర్యాదు చేసి వాహనాలను 14 రోజుల పాటు సీజ్ చేయించిన రెవెన్యూ అధికారులు సర్వేపల్లి రిజర్వాయరు విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. 
 
ఎం.శ్రీనివాసులు రెడ్డి, తండ్రి రాఘవరెడ్డి, మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఈఈ క్రిష్ణమోహన్ ను దరఖాస్తు సమర్పించిన వ్యక్తి ఎవరు? రిజర్వాయరులో దోపిడీకి గురైంది లక్ష క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అయితే కేవలం 10 వేల క్యూబిక్ మీటర్లు మాత్రమేని చెప్పడం వెనుక ఏ డాన్ ఒత్తిడి ఉందో బ‌ట్ట‌బ‌య‌లు చేయాల‌ని డిమాండు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు