కరోనా పాజిటివా? సీబీఐ పాజిటివా? సాయిరెడ్డిగారూ??

బుధవారం, 22 జులై 2020 (11:25 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికా వెల్లడించగా, విజయసాయి రెడ్డి కూడా స్వయంగా ధృవీకరించారు. దీంతో టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. కరోనా వైరస్ బారినపడిన విజయసాయిరెడ్డి త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఇది మంగళవారం చేసిన ట్వీట్. 
 
అయితే, కరోనా వైరస్ సోకిన విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స తీసుకోవడంపై బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖ కేజీహెచ్‌లో ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడమేంటని ప్రశ్నించారు. అసలు ఇది కరోనా పాజిటివా? వివేక హత్య కేసులో సీబీఐ పాజిటివా? అని ప్రశ్నించారు.
 
'అదేంటి హైదరాబాద్ పారిపోయారా? కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారా విజయసాయిరెడ్డి గారు. ఓహో అల్లుడు పాలన మీద నమ్మకం లేదా? గుండ్రాయిలా ఉన్న అచ్చెన్నకి కార్పొరేట్ వైద్యం ఎందుకు.. ఈఎస్ఐ ఉండగా అని ఒక బీసీ నాయకుడిని అవమానిస్తూ మీ రాక్షస మనస్తత్వం బయటపెట్టారు. 
 
మరి మీరు విశాఖలో కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం ఏంటి? అన్నట్టు ఇది కరోనా పాజిటివా? వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా? ఆయన హత్యకు గురైనప్పుడు మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?' అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. 
 
ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించిన ఈ వైరస్ కారణంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వైరస్ బారినపడుతున్న వారిలో రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా, అధికార వైకాపాకు చెందిన అనేక మంది నేతలు ఉన్నారు. తాజాగా వైకాపా ఎంపీ, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా ఈ వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.
 
దీనిపై విజయసాయి ట్విట్టర్‌లో స్పందించారు. "కరోనా పరిస్థితుల దృష్ట్యా, నాకు నేనుగా వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లో ఉండటం తప్పదు. టెలిఫోన్‌లోనూ అందుబాటులో ఉండను.. ఏవైనా కొన్ని అత్యవసర విషయాలకు మాత్రమే సంప్రదించగలరు" అంటూ ట్వీట్ చేశారు.
 
మరోవైపు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితలు స్పందించారు. రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప తమ మధ్య ఎలాంటి గట్టు తగాదాలు లేవని వ్యాఖ్యానించారు. 
 
విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకుని ట్విట్టర్‌లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.
 
అలాగే, అనిత స్పందిస్తూ, రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను విజయసాయిరెడ్డి గారూ అంటూ అనిత ట్వీట్ చేశారు. 
 
అటు, టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విజయసాయి రెడ్డి అంశంలో వ్యంగ్యం ప్రదర్శించింది. "క్వారంటైన్‌కు వెళుతున్నా అని చెప్పుకోవడం ఎందుకు, నాకు కరోనా పాజిటివ్ అని చెప్పుకోవచ్చుగా.. వై దిస్ కొలవెరి..?" అంటూ సెటైర్ వేసింది. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు