విజయసాయి రెడ్డికి షాకిచ్చిన సీఎం జగన్... 3 జిల్లాలకే పరిమితం!

గురువారం, 2 జులై 2020 (09:14 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సీనియర్ నేత, నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డికి తేరుకోలేని షాకిచ్చారు. విజయవాడ, తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయ సమన్వయ బాధ్యతల నుంచి విజయసాయి రెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో మరో సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. అదేసమయంలో విజయసాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పార్టీ బాధ్యతలను మాత్రమే విజయసాయి రెడ్డి చూసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇకపోతే, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పార్టీ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఈ నిర్ణయం ఇపుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా విజయసాయిరెడ్డిపై వివిధ రకాలైన విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు