కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సంగతి తనకు వదిలివేయాలని ఈ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేపట్టిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ 11 రోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో సీఎం చంద్రబాబు శనివారం స్వయంగా దీక్షా శిబిరానికి వచ్చి సీఎం రమేష్‌తో దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కడప ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు.. అవసరమైతే ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని హామీ ఇచ్చారు. ఉక్కు పరిశ్రమ కోసం స్ఫూర్తిదాయకమైన పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు.
ఆరోగ్యం బాగాలేకున్నా బీటెక్ రవి ఏడురోజులు దీక్ష చేశారని, సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించిందన్నారు. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేని నేతలు సీఎం రమేష్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దీక్షలపై అనవసరమైన విమర్శలు మానుకోవాలని సీఎం అన్నారు. విశాఖ ఉక్కు కోసం ఆనాడు ఆంధ్రులు పోరాడి విజయం సాధించామని, విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 19 వేల ఎకరాలు ఇచ్చిందని గుర్తుచేశారు.