బూతుల మంత్రితో పోటీపడుతున్న కొబ్బరిచిప్పల మంత్రి....

బుధవారం, 22 డిశెంబరు 2021 (14:53 IST)
విజ‌య‌న‌గ‌రం రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైంద‌ని, వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించార‌ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించార‌ని, మంత్రులు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పారు.
 
 
దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తార‌ని అయ‌న ప్ర‌శ్నించారు. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా? కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిల‌దీశారు.
 
 
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టార‌ని, మాన్సాన్ ట్రస్టు చైర్మన్ గా తొలగించి, ట్ర‌స్ట్ భూములు దోచుకోవాలని చూశార‌న్నారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు? రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా, ఇప్పటికీ నిందితులను పట్టుకోలేద‌ని ఆరోపించారు. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరుపారేసుకుంటున్నార‌ని అన్నారు. మీ అరాచక, దుర్మార్గాలు ఎల్లకాలం సాగవు అంటూ చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు