అమరావతి: దిక్సూచిలా పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తేనే మెరుగైన సమాజానికి బాటలు వేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధ్యాయ దినోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో మమ అనిపించేలా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించేవారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి వేడుకగా గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతిష్టాత్మకంగా, వేలాదిమంది సమక్షంలో గురుపూజోత్సవం నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తున్నామన్నారు. 2014లో గుంటూరులో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో బహిరంగంగా ఉత్తమ అధ్యాపకులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. గురువులను గౌరవిస్తేనే ఏ సమాజమైనా బాగుడుపడుతుందని అన్నారు. దిక్సూచిలా పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తేనే మెరుగైన సమాజ నిర్మాణం అవుతుందని, ఆ క్రమంలోనే వారికి స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అన్ని వృత్తుల కన్నా ఉత్తమమైనది ఉపాధ్యాయ వృత్తి అని స్పష్టం చేశారు.
ఈ ఏడాది మొత్తం 127 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందిస్తున్నామని, ఇందులో పాఠశాల విద్యలో 58 మందికి, ఇంటర్మీడియట్ 13, ఉన్నత విద్యలో 51, సాంకేతిక విద్యకు సంబంధించి ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులకు మెడల్స్ బహుకరిస్తున్నామని తెలిపారు. ప్రతి అవార్డు గ్రహీతకు ప్రశంసా పత్రం, మెడల్, రూ.20 వేల నగదుతో పాటు ట్యాబ్‌లు అందజేస్తున్నాని పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు విచ్చేసి జయప్రదం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమీషనర్ బి. ఉదయలక్ష్మీ, పాఠశాల విద్యాశాఖ ఇన్ చార్జ్ కమీషనర్ జి. శ్రీనివాసులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.