కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బంగారు కుటుంబం అయింది!

శుక్రవారం, 8 నవంబరు 2019 (13:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘటనా ప్రదేశానికి చేరుకున్న ఓ రైతు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో భూ సమస్యలు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని రైతు అన్నాడు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ వెనుక ప్రజాప్రతినిధుల అండ ఉందని వార్తలు వస్తున్న విషయాన్ని రైతు వివరించాడు. 
 
చక్కగా పరిపాలన చేయాలని ప్రజాప్రతినిధులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారే తప్ప.. హత్యా రాజకీయాలు చేయాలని కాదన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని, రాష్ట్రం నిజాం కాలంలా ఉందని రైతు మండిపడ్డాడు. 
 
రెవెన్యూ శాఖకు మంత్రి లేడని, ఇదేం పాలన అని రైతు ఎద్దేవా చేశాడు. భూమి విషయంలో ఏమైనా సమస్య వస్తే దాన్ని సామరస్యంగా పరిష్కరించాలని సూచించాడు. 'కాంగ్రెస్ పాలన బాగోలేదనే కదా.. టీఆర్ఎస్‌కు ఓట్లు వేసి ప్రజలు గెలిపించారు.. కేసీఆర్ మంచిగా పాలన చేయాలి' అని రైతు సూచించాడు. 
 
ఇకపోతే, హత్యలకు పాల్పడడం తప్పని, అధికారులు తప్పులు చేస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప హత్యలకు పాల్పడకూడదన్నారు. ప్రాణం పోతే తిరిగిరాదని.. ఇలాంటి ఘటనలకు పాల్పడకూడాదని కోరారు. అలాగే ఆ రైతు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. 
 
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అవుతుందని అనుకున్నామని, కానీ ఏం జరగలేదని కల్వకుంట్ల కుటుంబం ఒకటే బంగారం అయింది తప్ప.. ప్రజలకు ఏం జరగలేదని ఆయన విమర్శించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు