సర్కారుకు చిత్తశుద్ధి లేదు... తప్పుడు నివేదికలిస్తారా? ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

గురువారం, 7 నవంబరు 2019 (16:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె కేసు విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మెను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి సర్కారుకు లేదని వ్యాఖ్యానించింది. పైగా, ఐఏఎస్ అధికారులో తప్పుడు నివేదికలిస్తున్నారంటూ మండిపడింది. ఇలాంటి నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా అంటూ నిలదీసింది. 
 
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వచ్చిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టు తెలిపింది. అయితే, ప్రభుత్వం, ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావట్లేదని వాపోయింది.
 
జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా లెక్కలు చెబుతున్నారని తెలిపింది. ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని పేర్కొంది. తమతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. 
 
మీ సమాచారంతో సీఎం, కేబినెట్, ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? అని నిలదీసింది. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. 
 
ఆర్థిక శాఖ అధికారులు సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌లు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే, ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? అంటూ హైకోర్టు నిలదీసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు