సామాన్యుడికి అందుబాటులో సినిమా... మంత్రి స్పష్టీకరణ

మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (20:33 IST)
అమరావతి : సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయిస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్‌లో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సంఘ ప్రతినిధులతో సినిమా టిక్కెట్ల ధరల నిర్ణయంపై ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘ భేటీకి డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనివార్య కారణాలతో హాజరు కాకపోవడంతో, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసుల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
 
సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు... మంత్రి కాలవ శ్రీనివాసులకు కొన్ని ప్రతిపాదనలు అందజేశారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ఏసీ సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలు ఒక రకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనికి మంత్రి కాలవ శ్రీనివాసులు అంగీకరించలేదు. ఆయా ప్రాంతాల వారీగా, ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ల ధరలు నిర్ణయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 
 
మధ్యతరగతి, పేదలకు సరసమైన ధరలకు వినోదం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. మరోసారి జరిగే మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో సినిమా టిక్కెట్ ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ, సినీ నిర్మాతలు డి.సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్‌తో పాటు ఎగ్జిబిటర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు