నాకు ఎదో తేడా కొడుతుంది ప్లీజ్ వెళ్లకు... రాజీవ్‌కు శిరీష వాట్సాప్ మెసేజ్‌లు

ఆదివారం, 2 జులై 2017 (16:13 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన బ్యూటిషియన్ శిరీష ఆత్మహత్య కేసులోని మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆమె స్నేహితులు రాజీవ్, శ్రవణ్‌లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న కుకునూరు పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
అయితే, కూకునూరుపల్లిలోని పోలీసు క్వార్టర్‌లో ఆమెపై అత్యాచార ప్రయత్నం చేయడంతోనే శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందనేదీ పోలీసుల వాదన. ఇక్కడితో ఈ విషయం ముగిసిపోయినట్లేనని అందరు భావించారు. కానీ అనూహ్యంగా శిరీష కుటుంబసభ్యులు మాత్రం పోలీసుల వాదనతో వ్యతిరేకిస్తున్నారు. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు శిరీష కేసులో చివరి రెండు గంటలు ఏం జరిగిందనే విషయంపైనే ఇపుడు అందరి దృష్టి కేంద్రీకృతమైవుంది. 
 
శిరీష, రాజీవ్, శ్రవణ్‌లు 12వ తేదీ రాత్రి 11.30కు వెళ్ళారు. ఆ తర్వాత శిరీష ప్రమాదాన్ని శంకించి తాను ఉన్న ప్రదేశాన్ని సూచిస్తూ భర్తకు వాట్సాప్ లోకేషన్ 1.58 నిమిషాలకు, 1.59 నిమిషాలకు పంపింది. అదేసమయంలో 1.55 నుంచి 2 గంటల వరకు రాజీవ్ సెల్ ఫోన్‌కు శిరీష పదేపదే వాట్సాప్ మెసేజ్‌లు పంపింది. తనను ఒంటరిగా ఒదిలివెళ్లవద్దని మెస్సెజ్‌ల్లో ప్రాధేయపడింది. రాజీవ్ వెళ్లకు. నాకు దూరమవ్వకు ప్లీజ్.. రాజీవ్ ప్లీజ్ వాళ్లు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా వెళ్లకు ప్లీజ్.. నన్ను వదిలి వెళ్లకు ప్లీజ్ రాజీవ్ ప్లీజ్.. నాకు ఎదో తేడా కొడుతుంది ప్లీజ్ వెళ్లకు నాకు అర్ధం అవుతోంది అంతా.. ప్లీజ్ వెళ్లకు ...అంటూ వాట్సాప్ మెస్సెజ్‌లు పెట్టింది శిరీష.
 
ఆ తర్వాత మళ్లీ క్వార్టర్‌లోకి వెళ్లిన రాజీవ్, శ్రవణ్‌‍లు మళ్లీ అంతా కలిసి మద్యం తాగారు. మళ్లీ సిగరెట్ తాగుదామని రాజీవ్, శ్రవణ్‌లు బయటకు వచ్చేసరికి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆమెను కౌగలించుకుని దగ్గర అవడానికి ప్రయత్నించాడు. తాను అలాంటిదాన్నికాదని తనను వదిలి వేయాలని శిరీష పెనుగులాడుతూ గట్టిగా ఏడ్చేసింది. శిరీష అరుపులు విని లోపలికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్‌లు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా గదిలోంచి బయటకు తీసుకొచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత వీళ్లంతా క్వార్టర్ నుంచి 2.30కి తిరిగి హైదరాబాద్ బయల్దేరారు.
 
మార్గమధ్యంలో శిరీషన్ రాజీవ్, శ్రవణ్‌లు కొట్టినట్టు పోలీసులు చెపుతున్నారు. ఈ ముగ్గురు కారులో గొడవపడుతూనే దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించి రాజీవ్ స్టూడియోకు తెల్లవారుజామున 3.45కి చేరుకున్నారు. అంటే గంటంపావులో వీరు కూకునూరుపల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్నారన్నమాట.
 
కారు దిగిన తర్వాత శిరీష ఏడుస్తూనే రాజీవ్ స్టూడియోలోనికి బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేసి 3.47కి లోనికి వెళ్లింది. తర్వాత శిరీష 3.54కి రాజీవ్‌కు వీడియో కాల్ చేసింది. అతను ఫోన్ ఎత్తలేదు. 3.55కి రాజీవ్ కూడా బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా లోనికి వెళ్లి కేవలం 3.58కి బయటకు వచ్చాడు. ఒలా క్యాబ్‌ను శ్రవణ్ కోసం 3.59కి బుక్ చేశాడు. తర్వాత 4.03కి రాజీవ్ వీడియో కాల్‌ను శిరీషకు చేశాడు. ఆమె ఫోన్ ఎత్తలేదు. తర్వాత రాజీవ్ మళ్లీ కింద నుంచి పైన తన గదికి 4.07కి వెళ్లాడు. శిరీష ఫోన్ తీయకపోవడం, గదిలోనికి వెళ్లి తలుపు వేసుకోవడం, పిలిచినా పలకకపోవడంతో ఆందోళన చెందిన రాజీవ్ బెడ్‌రూం తలుపులను గట్టిగా బలవంతంగా నెట్టి లోనికి వెళ్లాడు. శిరీష ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటాన్ని చూశాడు. 
 
ఆమె స్పృహలో లేకపోవడంతో కంగారుపడి 4.11కి జరిగిన విషయాన్ని శ్రవణ్‌కు ఫోన్ చేశాడు. ఆ వెంటనే శ్రవణ్ సూచన మేరకు పోలీసులకు సమాచారం అందించడానికి డయల్ 100కి ఫోన్ చేశాడు. దీంతో శ్రవణ్ తాను ఎక్కిన ఒలా క్యాబ్‌లోనే తిరిగి రావడంతో వీరిద్దరు కలిసి ఆపోలో ఆసుపత్రికి వెళ్లి ఆంబులెన్స్‌ను తీసుకుని వచ్చారు. ఆంబులెన్స్ సిబ్బంది వచ్చి శిరీషను చూసి ఆమె చనిపోయిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే, శిరీష కుటుంబ సభ్యులు మాత్రం ఆత్మహత్య కాదనీ, చంపి ఉరికి వేలాడదీసివుంటారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చివరి 2 గంటలు ఏం జరిగిందన్నదానిపై క్లారిటీ కావాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి