స్పీకర్ పదవిలో కొనసాగే అర్హత తమ్మినేనికి లేదు: టీడీపీ ధ్వజం

గురువారం, 2 జులై 2020 (23:28 IST)
ఏపీ శాసనసభ స్పీకర్ పై టీడీపీ శాసనమండలి సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యవహార శైలినీ ప్రశ్నించారు. ఈ మేరకు బీదా రవిచంద్ర యాదవ్, గౌరివాని శ్రీనివాసులు, బిటి నాయుడు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు...
 
మండలి వ్యవహారాల్లో స్పీకర్ జోక్యం సారి కాదు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం స్పీకర్ గా కొనసాగే అర్హత లేదు. రాజకీయాలే ముఖ్యం అని భావిస్తే స్పీకర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడుకోవాలి.

స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తులను చూసిన ఈ ప్రజాస్వామ్య దేశంలో.. స్పీకర్ గా ఉండి రాజకీయాలు మాట్లాడిన వ్యక్తిని చూస్తామని అనుకోలేదు. శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా మంత్రులే అడ్డుకున్నారు.

ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత ఇతర బిల్లులు పెట్టమని టిడిపి సభ్యులు కోరితే అమరావతి, మూడు రాజధానులు బిల్లులపై పట్టుపట్టారు. ఇదంతా తెలిసి కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం శాసన మండలిలో సభ్యుల కారణంగానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని వ్యాఖ్యానించడం దుర్మార్గం.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు, సభ్యులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని తమ్మినేని గుర్తుంచుకోవాలి.
 
స్పీకర్ ఒక టీమ్ కి కోచ్ లా వ్యవహరిస్తున్నారు: అనగాని సత్యప్రసాద్
శాసమండలిలో టీడీపీ సభ్యులు అడ్డుకోవటం వల్లే ద్రవ్య వినిమయ బిల్లు పెట్టలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పటం పచ్చి అబద్దం. ఇది వైసీపీ దివాళుకోరుతానికి నిదర్శనం. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి అబద్దాలు, అవాస్తవాలతో ప్రజలను తప్పుదారి పట్టించటం సరికాదు. 

సీఆర్డేయే బిల్లు రద్దు, వికేంద్రీకరణ బిల్లు ఆమోదించుకునే కుట్రలో భాగంగానే శాసనమండలిలో ద్రవ్యవినియమ బిల్లును ముందుగా ప్రవేశపెట్టకుండా వైసీపీ సభ్యులే అడ్డుకున్నారు. బిల్లు ప్రవేశపెట్టమని  మా టీడీపీ సభ్యులు 30 సార్లు కోరారు.  కానీ మంత్రులే సభలో గందరగోళం సృష్టించి బిల్లును అడ్డుకున్నారు.

బిల్లు పెట్టకుండా ఎవరు అడ్డుకున్నారో వీడియో పుటేజీ బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయి.  వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ద్రవ్య వినిమయ బిల్లు కు గవర్నర్ చేత ఆర్డినెన్స్ తీసుకురావాలి. స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించుకునేందుకు ఈసీని మార్చడానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం  ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆర్డినెన్స్ తీసుకురావచ్చు కదా? 

శాసనసభలో రెండు పక్షాల మద్య ఎంపైర్ గా వ్యవహరించాల్సిన స్పీకర్ ఒక టీమ్ కి కోచ్ లా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.  ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా శాసనసభను నిర్వహించటంలో తమ్మినేని సీతారాం పూర్తిగా విఫలమయ్యారు.

ప్రజాస్వామ్యంలో శాసనసభ అత్యున్నత ప్రజా వేదిక. కానీ  తమ్మినేని స్పీకర్ గా శాసనభలో అడుగుపెట్టి నాటి నుంచి శాసనసభ ప్రతిష్ట మసకబారింది. తమ్మినేని శాసనసభలో అర్దవంతమైన చర్చలకు అడ్రస్ లేకుండా చేశారు.

స్పీకర్ సభలో సభ్యుల మద్య  సహృద్భావం, మర్యాద, మన్నన, గౌరవం, ఏడాది కాలంలో సభను ఒక్క సారి కూడా సజావుగా నడిపంచలేదు.  తమ్మినేని అబద్దాలు చెప్పటం మాని సభను సజావుగా నడిపించి సభ గౌరవం కాపాడటంపై దృష్టి పెట్టాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు