రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఇసుక సమస్య లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇకపై రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక సరఫరానే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే వారం రోజుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని ఆదేశాలిచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ప్రణాళిక, విధివిధానాలను ఖరారు చేస్తూ ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.
ఇసుక రీచ్ పంపిణీ కేంద్రాల వద్ద పండగ వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు ఆయా జిల్లాల మంత్రులతో ప్రారంభోత్సావాలను నిర్వహించాలని సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఇసుక వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్లు జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో నూతన ఇసుక డిపోలు, స్టాక్ పాయింట్ లను గుర్తిస్తారన్నారు.
జిల్లా కలెక్టర్లు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అన్ని అనుమతులతో ఏర్పాటు చేసే కొత్త ఇసుక రీచ్ లను గుర్తిస్తారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీగా వున్న ఎఎంసి స్థలాలను కూడా ఇసుక నిల్వ కోసం వినియోగిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ఎపిఎండిసి ఆధ్వర్యంలో కొత్త రీచ్ లను గుర్తించడంతో పాటు వాటిని వినియోగంలోకి తీసుకువస్తారని చెప్పారు.
ప్రతిరీచ్ లోనూ రెండు షిఫ్ట్ లలో సెలవు రోజులతో కలిపి పనులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. రియల్ టైంలో స్టాక్ యార్డ్ నుంచి ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక కోసం వచ్చిన వాటిల్లో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామన్నారు. అన్ని స్టాక్ పాయింట్లు, ఇసుక డిపోల వద్ద ఒక పండుగ వాతావరణంను కలుగచేస్తామని తెలిపారు.
సీసీ కెమెరాలు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాను అరికడతామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి డీజీని నియమించడం జరుగుతుందన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 200 వరకు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు బిల్లు తెస్తున్నామని మంత్రి ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ సగటు ఇసుక వినియోగం 80 వేల టన్నులు అయితే ఇప్పుడు 1.20 లక్షల టన్నులు అందిస్తున్నామన్నారు. అయితే గత మూడు నెలలుగా ఇసుక సమస్య తలెత్తడంతో అధిక మొత్తంలో ఇసుక అవసరం అయినందున వాటిని 2 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు.
అందులో భాగంగా 137 ఇసుక రీచ్ పాయింట్లను 180కి పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల స్టాక్ పాయింట్ లలో వినియోగదారుల కోసం ఇసుక నిల్వలు సిద్ధంగా ఉంచుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 275 ఇసుక రీచ్ లకు గానూ ఈ నెల 6వ తేదీ నాటికి 83 ఇసుక రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు మొదలయ్యాయని తెలిపారు.
నిన్నటి వరకు అంటే 11వ తేదీ వరకు మొత్తం 99 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ప్రారంభం అయ్యాయని గుర్తుచేశారు. గత నాలుగు రోజుల్లోనే 97 వేల మెట్రిక్ టన్నుల నుంచి 1.21 లక్షల మెట్రిక్ టన్నులకు ఇసుక వెలికితీతను పెంచామన్నారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అదనంగా స్టాక్ యార్డ్ లు, సాండ్ డిపోలను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. స్టాక్ పాయింట్ ల వద్దే జిల్లాల వారీగా రవాణాతో కలిపి ఇసుక ధరల పట్టికను ప్రదర్శిస్తామన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నామని హెచ్చరించారు. ఇందుకోసం ఎపిఎంఎంసి నిబంధనల్లో మార్పు తీసుకువస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాదారులకు గరిష్టంగా రెండేళ్ల పాటు శిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పేరుతో జరిగిన దోపిడీ విధానాలను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి గుర్తుచేశారు. ఇప్పటికే ఇసుక రీచ్ లలో తవ్వకాలను ముమ్మరం చేయించామన్నారు. సాధారణ వినియోగం కన్నా ఎక్కువగానే ఇసుకను వెలికితీస్తున్నామని తెలిపారు.
వరదలు, భారీ వర్షాల వల్ల రీచ్ ల నుంచి ఇసుకను తీయలేక పోయామన్నారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో దీర్ఘకాలంగా నిండని ప్రాజెక్ట్ లు కూడా నిండుకుండల్లా మారాయని వెల్లడించారు. ఒక్క శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎనిమిది సార్లు ఎత్తాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి ఊపిరి పోయగా, అదే క్రమంలో భవన నిర్మాణరంగంలో పనులు మందగించాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టాయని ఈ నేపథ్యంలో అన్ని రీచ్ ల నుంచి ఇసుకను తీస్తున్నామన్నారు.