విద్యా వ్యవస్థ ప్రక్షాళన, సంస్కరణలలో భాగంగానే ఈ చర్యలు: ఆదిమూలపు సురేష్

బుధవారం, 27 అక్టోబరు 2021 (23:04 IST)
విద్యా వ్యవస్థ ప్రక్షాళన, సంస్కరణలలో భాగంగానే ఈ చర్యలు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.  మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... ఇంకా ఏమన్నారంటే..
 
1- ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ..  కొన్ని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో కొన్ని వాస్తవాలను రాష్ట్ర ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రుల ముందు ఉంచాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ప్రైవేట్‌ యాజమాన్యం కింద నడిచే విద్యాసంస్థల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు అప్పగించారు.

ప్రైవేట్‌, ఎయిడెడ్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఏవిధంగా పనిచేస్తున్నాయి, టీచర్‌ - పీపుల్‌ రేషియోకు సంబంధించి (టీపీఆర్‌) తగినంత మంది ఉన్నారా.. లేరా? ఫలితాలు ఎలా వస్తున్నాయి, నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి, వాటిని ఇంప్రూవ్‌ చేసేందుకు, వాటిలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నాడు-నేడు  కార్యక్రమం ద్వారా ఆస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో వెలుగు చూసిన పలు అంశాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. అ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 

- ఎక్కడైతే దీర్ఘకాలికంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఎయిడెడ్‌ స్కూళ్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. 
 
2- మరికొన్ని చోట్ల యాజమాన్యాల తగదాల వల్ల, ఉపాధ్యాయులకు, యాజమాన్యాలకు సఖ్యత లేకపోవడం వల్ల కొన్ని స్కూళ్లు ఇబ్బందులకు గురవుతున్నాయి. అలాగే కొన్నిప్రాంతాల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆ స్కూళ్లల్లో చేరని పరిస్థితులు నెలకొనిఉన్నాయి. ఈ అంశాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కమిటీ నివేదిక ఇచ్చింది. 

- ఒకవేళ ప్రయివేట్‌ యాజమాన్యాలు... స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తే మెరుగ్గా నడిపించుకోవాడానికి, స్కూళ్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ, ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ ఉపాధ్యాయులను నియమిస్తూ, ఆస్తులతో పాటు ఇస్తే వాటితో నాడు-నేడు ద్వారా ఆయా విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవచ్చంటూ కమిటీ నివేదికలో పేర్కొంది. అందులో భాగంగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థల నిర్వహణపై నిర్ణయం తీసుకోవడం జరిగింది.
 
3- అయితే ఈ అంశంపై కొన్ని పత్రికలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను  ప్రభుత్వం విలీనం చేసుకుంటే స్కూళ్లు మూతపడిపోతాయని... విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారంటూ.. అసత్య ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏ ఒక్క ప్రైవేట్‌ యాజమాన్యాన్ని బలవంతం పెట్టడం జరగలేదు. యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించకుండా కచ్చితంగా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌లను కూడా మంత్రి సురేష్ మీడియా ముందు ఉంచారు.
 
4- ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు...  "తమకు గ్రాంట్‌ అవసరం లేదు, ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్‌ చేసి, ప్రైవేట్‌ విద్యాసంస్థలుగా నడుపుకుంటామని" యాజమాన్యాలు ఇచ్చే విల్లింగ్‌నెస్‌తో పాటు ఉపాధ్యాయుల ఇచ్చే విల్లింగ్‌నెస్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని అలాంటి విద్యా సంస్థలను మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది, తీసుకుంది. ఈ ఆప్షన్‌ను చాలా స్పష్టంగా వారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 137 పైచిలుకు డిగ్రీ కాలేజీలు, వాటిలో ఏడు డిగ్రీ కాలేజీలు మేనేజ్‌మెంట్‌, స్టాఫ్‌తో పాటు, వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తున్నామంటూ చాలా స్పష్టంగా, రాతపూర్వకంగా ఇచ్చాయి.

- 124 డిగ్రీ కాలేజీలు కేవలం స్టాఫ్ ను మాత్రమే సరెండర్‌ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని, ప్రైవేట్‌ కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. 

- 93శాతం డిగ్రీ కాలేజీలు విల్లింగ్‌నెస్‌ను ఇవ్వడం జరిగింది. 

- అయితే ప్రభుత్వం బలవంతంగా తమ విద్యాసంస్థలను తీసుకున్నాయని, తామే నడుపుకుంటామని చెబితే అందుకు మాకెలాంటి అభ్యంతరం లేదు. 

5- పిల్లలకు చదువు చెప్పే ప్రమాణాలు బాగా దిగజారిపోవడం, విద్యాసంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్లే యాజమాన్యాలు ఇవ్వదలచుకుంటే వాటిని తీసుకుని నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా నడపాలని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రిగారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 

- 122 ఎయిడెడ్‌ జూనియర్ కాలేజీలు ఉంటే.. అయిదు జూనియర్‌ కాలేజీలు ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం స్టాఫ్‌తో పాటు మొత్తంగా 108 జూనియర్‌ కాలేజీలు అంటే మొత‍్తంగా 88.5 శాతం ప్రైవేట్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తాము స్వచ్ఛందంగా ఆప్షన్లు ఇచ్చాయి.
 
6- ఇక స్కూళ్ల విషయానికి వస్తే...  దాదాపు 1,988 స్కూళ్లు ఉంటే 1,200 స్కూళ్ల యాజమాన్యాలు స్టాఫ్‌తో పాటు ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని రాతపూర్వకంగా ఇచ్చాయి. అలాగే 88 స్కూళ్లు ఆస్తులతో పాటు స్టాఫ్‌ను ఇస్తున్నట్లు ఒప్పుకున్నాయి. మొత్తంగా 1302 స్కూళ్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 

- విశాఖలో సెంట్‌ పీటర్స్‌, కాకినాడలో సెంట్‌ యాన్స్‌ స్కూళ్ల యాజమాన్యాలు "తాము స్కూళ్లు మూసివేస్తున్నామని, ప్రభుత్వం బలవంతంగా ఎయిడెడ్‌ స్కూళ్లను లాక్కున్నది కాబట్టి మీ పిల్లల్ని వేరే స్కూళ్లలో చేర్చుకోండని" ఏదైతే చెప్పడం జరిగిందో దానివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

- ఇప్పటికైనా ఆ స్కూళ్ల యాజమాన్యాలు తామే నడుపుకుంటామని చెబితే  ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ విల్లింగ్‌నెస్‌ ఇచ్చినా.. విత్‌డ్రా చేసుకుంటామంటే వారి ఆప్షన్‌ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. 
- ఇక అక్కడ చదువుతున్న విద్యార్థులను సమీపంలోని పాఠశాల్లలో చేర్చుకునేందుకు మ్యాపింగ్‌ చేయడానికి కూడా ఒక టైమ్ టేబుల్‌ వేయడం జరిగింది. సరెండర్‌ చేసిన ఉపాధ్యాయులకు పోస్టింగ్స్‌ ఇచ్చేందుకు నెలాఖరున వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నాం.
 
7- తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమీపంలోని పాఠశాలల్లో అయినా లేకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనుకుంటే అక్కడైనా వారిని చేర్పించేవరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంశాన్ని రాజకీయం చేసి మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీనే ఇందుకు బాధ్యత వహించాలి.  ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్కూళ్లను ఈ స్థితికి తీసుకువచ్చి, వాటిలోని ఖాళీలను టీడీపీ సర్కార్‌ ఎందుకు భర్తీ చేయలేదని అడుగుతున్నాం.
 
8- రాష్ట్ర విభజన జరిగాక కూడా.. ఈ సమస్య వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుగారు ఈ పోస్టులను భర్తీ చేయవద్దని ఆదేశాలు జారీ చేయడం వాస్తవం కాదా? 6400 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా ఉండేందుకే ఎయిడెడ్‌ విద్యాసంస్థలను విలీనం చేస్తున్నారని మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదు. అసలు ఆ పోస్టులను భర్తీ చేయవద్దని లేఖ రాసింది ఎవరు? అప్పటి విద్యాశాఖమంత్రి గంటా కాదా..? అని అడుగుతున్నాం. మీరు చేసిందంతా చేసి, మాపై నెపం తోయాలని చూస్తారా? 
 
9- మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో నెం.37 ద్వారా ఖాళీలు ఉంటే భర్తీ చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చాం. ఈ ఖాళీల భర్తీ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. వారికి సంబంధించి వారికి మాత్రమే ముందుగానే రిజర్వ్‌ చేసుకుంటారే కానీ, నైపుణ్యాలకు తిలోదకాలు ఇస్తూ ఎయిడెడ్‌ పోస్టులను భర్తీ చేసుకోవడం వాస్తవం కాదా?

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ఏవిధంగా నడుపుతున్నారో... కమిటీ నివేదిక ద్వారానే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ విద్యాసంస్థలను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రిగారు ఈ సంస్కరణలు చేపట్టారే తప్ప, ఎక్కడా కూడా ఎవరినీ బలవంతంగా కానీ, బెదిరించిగానీ ఆయా విద్యాసంస్థలను తీసుకోలేదు. - ఇప్పటికైనా ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తున్న అవాస్తవాలను, అసత్యాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించాలి. పనితీరు బాగున్న విద్యాసంస్థల విషయంలో మేము జోక్యం చేసుకోలేదు. 
 
10- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత రెండేళ్లుగా విద్యా వ్యవస్థలో చేపట్టిన పెను మార్పులు, సంస్కరణలలో భాగంగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే ప్రధాన లక్ష్యం. పోటీ పరీక్షలు తట్టుకునేలా, ఇంగ్లీష్‌ మీడియం విద్యను అమలు చేయడం, కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా వాతావరణం కల్పించేలా నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యాదీవెన, విద్యా కానుక, మధ్యాహ్న భోజన పథకం, జగనన్న గోరుముద్ద తదితర పథకాలను అందించడం జరుగుతోంది. 

- ఈ పథకాలన్నీ చక్కగా అమలు కావడంతో తట్టుకోలేని, ఓర్వలేని బుద్ధితో టీడీపీ, దాని అనుకూల మీడియా రాస్తున్న పిచ్చిరాతలు పీక్స్‌కు చేరిపోయాయి. 

- ప్రతిపక్షాల గుండెల్లో విషం ఎంతగా దాగుందో దీని ద్వారానే తెలుస్తోంది. కడుపులో కత్తులు పెట్టుకుని, లేని ప్రేమను ఒలకబోస్తూ, తల్లిదండ్రులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తోంది.
 
11- ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు ప్రతిపక్షం అడుగు అడుగునా అడ్డుపడుతోంది. స్కూళ్లు ప్రారంభిస్తామంటే కరోనా సాకుతో తల్లిదండ్రులు భయపడుతున్నారంటూ కోర్టులకు కూడా వెళ్లారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిగారి ఆధ్వర్యంలో ఆధునీకరించడం జరిగింది. ఆగస్ట్‌లో స్కూళ్లను ప్రారంభించగానే 80 నుంచి 90శాతం మంది విద్యార్థులు హాజరు అయ్యారు. దీనికి ప్రతిపక్షాలు ఏమి సమాధానం చెబుతారు. కోవిడ్‌ నెపంతో పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థుల భవిష్యత్‌తో నారా లోకేష్‌ రాజకీయం చేయడం ఎంత దుర్మార్గపు చర్య..?
 
12- ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఎలా వచ్చాయో కూడా తెలియని వాళ్లు కూడా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. విద్యారంగం అభివృద్ధికి అనేక సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఎయిడెడ్‌ నిధులను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విద్యను అందించాలి. - రెగ్యూలేటరీ కమిషన్‌ ఫిక్స్‌ చేసిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే.. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 

- ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వాస్తవాలను వెల్లడించేందుకు మేము ఎప్పుడయినా సిద్ధంగా ఉన్నాం. 
- బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, నిర్మాణాత్మక విమర్శలు, సూచనలు చేయండి. అంతేకానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లల భవిష్యత్‌తో ఆడుకోవద్దని విజ్జప్తి చేస్తున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు