ఏపీలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:37 IST)
రోజురోజుకు కరోనా విజృంభిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగింది. ఏపీలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. పెద్దఎత్తున మాస్క్‌ల పంపిణీ వల్ల కరోనా నుంచి కొంత మేర రక్షణ లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు పంపిణీ చేయాలన్న లక్ష్యంలో భాగంగా మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాల్సి ఉంటుందని సూచించారు.

మెడికల్‌ ఆఫిసర్స్‌ నిర్ధారించిన వారికే కాకుండా ఫీల్డ్‌లో గుర్తించిన అందరికీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, మధుమేహం, బిపి ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

నమోదవుతున్న కేసులు, వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

రైతుబజార్లు, మార్కెట్లలో సర్కిల్స్‌, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాలని, ఎక్కడా జనం గమికూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు