రుతుపవనాల ప్రవేశంలో జాప్యం... మరో మూడు రోజులు ఎండలే

మంగళవారం, 6 జూన్ 2023 (14:30 IST)
నైరుతి రుతుపవనాల ప్రవేశంలో మరింత ఆలస్యంకానుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే మూడు రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. ముఖ్యంగా, పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. రుతుపవనాల రాక ఆలస్యంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
 
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని మరో 212 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. 
 
సోమవారం ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా శ్రీరామవురంలో 43.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు