ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో స్వచ్ఛ భారత్‌కు ఏ విధంగా అయితే స్పందన లభించిందో అలాంటి కార్యక్రమాన్నే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. స్వచ్ఛతే సేవ పేరుతో మన నగరాన్ని మనం స్వచ్ఛంగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో తిరుపతి నగర పాలక సంస్థ హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించింది.
తారకరామ స్టేడియంలో జరిగిన హాఫ్ మారథాన్‍లో 7 వేల మందికి పైగా యువతీ, యువకులు ఉల్లాసంగా ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛత కోసం అడుగు వేయడమేకాకుండా ఆరోగ్యం కోసం కూడా నడవాలంటూ యువతీయువకులు పిలుపునిచ్చారు.
21కె, 10కె, 5కె రన్‌లు నిర్వహించారు. చిరుజల్లులు పడుతున్నా లెక్క చెయ్యకుండా మారథాన్‌లో పాల్గొన్నారు. మారథాన్‌లో పాల్గొనే వారిని ఉత్సాహపరుస్తూ పలు సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు వేశారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, నగర పాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, ఎస్పీ మహంతి, ఎంపీ వరప్రసాద్‌లు మారథాన్‌లో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు హాఫ్ మారథాన్ జరిగింది.