జనం బతికి బట్ట కట్టాలంటే మంగళ, బుధవారాలు ఇంటి బయటకు రావద్దు..

మంగళవారం, 23 మే 2017 (06:00 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం బతికి బట్టకట్టాలంటే మంగళవారం, బుధవారం పగటిపూట ఇళ్లలోంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది. ఆ ప్రకటనను వాస్తవం చేస్తూ సోమవారం అర్థ రాత్రి నుంచి ఒంటిని భగభగ మండింటే వడగాడ్పులు రెండు రాష్ట్రాలను ఆవరించాయి. రాత్రి పూట విధులను నిర్వర్తిస్తున్న వారయితే ఈ వడగాడ్పుల ప్రభావం ఈ రెండు రోజుల్లో ఏ స్థాయిలో ఉంటుందో సోమవారం నడిరాత్రే అనుభవించేశారు.


ఈ రెండు నెలలుగా వేసవి తాపాన్ని చవిచూస్తున్నవారు ఈ మంగళ, బుధవారాల్లో ప్రత్యక్ష నరకాన్ని వేడి రూపంలో చూడబోతున్నారు. ఇన్నాళ్లుగా వేసవి తాపాన్ని మనం చూసింది, భరించింది ఒకటయితే ఈ రెండు రోజులు భరించాల్సింది ఒకెత్తుగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి. దయచేసి మంగళవారం అంటే నేటి ఉదయం నుంచి రేపటివరకు అంటే బుధవారం వరకు అన్నిపనులనూ పక్కన పెట్టి ఇళ్లలో ఉండిపోవాలని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు స్వచ్చందంగా నిర్ణయంచుకుని ఇళ్లలో ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు.

ఇన్నాళ్లు వేసవి వడగాడ్పుల వల్ల జరిగిన మరణాలకంటే ఈ రెండు రోజులు జరిగే మరణాలే ఎక్కువని చెబుతున్నారు. అందుకే జనం కూడా తమవంతుగా ఇంటికి పరిమితం కావడం, మంచినీళ్ల సీసా నిరంతరం పక్కనే ఉంచుకోవడం. వీలయితే మజ్జిగ, నిమ్మకాయ రసం ముందే తయారు చేసుకుని దప్పిక అనిపించినప్పుడల్లా తాగడం.. ఇదొక్కటే ఈ రెండు రోజులు మనకు వడదెబ్బ తగలకుండా నిరోధిస్తుంది. 
 
రోహిణి కార్తె తీవ్రదశ ప్రారంభానికి గుర్తుగా మంగళ వారం వేకువ జామున  సైతం వేడిగాలి విపరీతంగా ప్రభావం చూపుతోంది. ఏ ప్రాంతంలో చూసినా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిన స్థితిలో మంగళవారం పగటివేళ మరింతగా ఎండలు మండే వీలుందని తెలుస్తోంది తీవ్రమైన వడగాడ్పుల కారణంగా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.

ఇదే పరిస్థితి ఈ నెలాఖరు వరకు ఉండే అవకాశముందని అంటున్నారు. మంగళ, బుధవారాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కానీ వాటి ప్రభావం చాలా తక్కువ కాబట్టి జనం అసాధారణ జాగ్రత్తలు తీసుకోకుంటే దారుణ పరిణామాలను ఎదుర్కొనక తప్పదు. 
 
మంచినీటి కంటే మజ్జిగ ముందే భారీ స్థాయిలో తయారు చేసుకుని పదే పదే దాన్ని తాగడం ఒక్కటే ఈ రెండు రోజుల ఉష్ణ వాతావరణంలో మనిషిని కాపాడగలదు. దయచేసి ఈ రెండురోజులూ పగటి పూట ఇంటి నుంచి రావద్దు. ఆఫీసులకు రావలసిన వారు కూడా ఉదయం ఎనిమిది గంటల లోపే ఆఫీసుకు చేరుకునేలా ప్లాన్ వేసుకుంటే మరీ మంచిది. 
 
ముంచుకొస్తున్నది ప్రాణాంతక వడదెబ్బ కాలం. జాగ్రత్త..

వెబ్దునియా పై చదవండి