నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం : కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశంకానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో మంత్రిమండలి భేటీ కానుంది. రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తుల బదలాయింపు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై కేబినెట్‌లో ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది. 
 
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ అవుతోంది. రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తుల బదలాయింపు సహా కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రహదారులు భవనాల శాఖకు చెందిన రూ.4 వేల కోట్ల ఆస్తులను.. రహదారుల అభివృద్ధి కార్పోరేషన్‌కు బదలాయించే ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించనున్నారు. 
 
ఏపీలో కొత్తగా లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. కేంద్రం సహకారంతో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్‌లకు, పోర్టులకు అనుసంధానంగా ఈ లాజిస్టిక్ పార్కులను రాష్ట్రంలో ఏర్పాటు చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో నిధుల సమీకరణకు సంబంధించి మరో కొత్త కార్పోరేషన్ ఏర్పాటు ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 
 
ఏపీలో నూతన సీడ్ పాలసీ అమలుపై చర్చించే అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానంను ఏపీలో ఏవిధంగా అమలు చేయాలనే అంశంపై మంత్రివర్గం సమీక్షించనుంది. నేతన్న నేస్తం, పాఠశాలల్లో నాడు- నేడు రెండో దశ పనులకు ఆమోదం తెలపనున్నారు.3 పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారంగా.. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చే అంశంపైనా కేబినెట్​లో చర్చించనున్నారు. 
 
ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన పీవీ సింధుకు అభినందనలు తెలియచేయటంతో పాటు ప్రోత్సాహకాలు ప్రకటించే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు