చిన్నారులను కరోనా మహమ్మారి భయాందోళనల నుండి కాపాడే క్రమంలో జాతీయ బాలల హక్కుల కమీషన్ విభిన్న కార్యక్రమాలను చేపడుతుందని బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు, వీధి బాలలు, మహిళాభివృధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కరోనా బారిన పడుతున్న చిన్నారులు, వారి ఇబ్బందులను ఎదుర్కొనేలా తగిన భరోసాను కల్పిస్తూ జాతీయ బాలల హక్కుల కమీషన్ 1800-121-2830 పేరిట ఉచిత చరవాణి సంఖ్యను [టోల్ ఫ్రీ నెంబర్] అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
ఈ చరవాణి సంఖ్యలో నిపుణులైన కౌన్సిలర్లు, మానసిక తత్వశాస్త్ర నిపుణులు అందుబాటులో ఉంటారని, కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఆందోళనలో ఉన్న చిన్నారులకు ప్రాధమికమైన మానసిక ధైర్యం అందించేందుకు సహకరిస్తారని పేర్కొన్నారు. వారిని కరోనా ఆలోచనల నుండి దూరం చేసి సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన సలహాలను ఇస్తారన్నారు.
సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వీరు ఉచిత చరవాణి సంఖ్యలో సిద్ధంగా ఉంటారన్నారు. పూర్తి స్ధాయి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ జాతీయ బాలల హక్కుల కమీషన్ ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ సైన్స్, న్యూరో సైన్సెస్ సహకారంతో చిన్నారుల ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. చిన్నారులు, వారి తల్లి దండ్రులు ఈ ఉచిత చరవాణి సంఖ్యను చేరుకోవటం ద్వారా ప్రయోజనం పొందాలని బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు, వీధి బాలలు, మహిళాభివృధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ప్రకటించారు.