చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న సినీ నిర్మాత నట్టి కుమార్

శనివారం, 30 డిశెంబరు 2023 (14:57 IST)
సినీ నిర్మాత నట్టి కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. చోడవరంలోని పూర్ణా థియేటర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తొలుత తాను వైసీపీ సానుభూతిపరుడినేనని, అయితే, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో విసిగిపోయానని తెలిపారు. జగన్ మొత్తం రెడ్డి కులపాలన చేశారని విమర్శించారు.
 
ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే జగన్ రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు కూడా గుర్తించారన్నారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు చెప్పిన ఆయన తమలాంటి వాళ్లను వైసీపీ తన స్వార్థానికి ఉపయోగించుకుందని విమర్శించారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ.2 కోట్ల విలువైన చర్చి ఆస్తులను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
 
విశాఖపట్టణానికి కోట్లాది రూపాయల విలువైన పరిశ్రమలు వచ్చినట్టు మంత్రి అమర్నాథ్ చెబుతున్నారని, ఎక్కడ, ఎన్ని ఏమేమి పరిశ్రమలు వచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆలోచనకు పవన్ కల్యాణ్ కూడా తోడు కావడంతో జగన్‌కు ఏం చేయాలో తెలియక దండయాత్రలు చేయిస్తున్నారని నట్టి కుమార్ విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు