తినే ఆహారం విష పదార్థం.. అందుకే ఏలూరులో అంతుచిక్కని వ్యాధి???

మంగళవారం, 8 డిశెంబరు 2020 (08:34 IST)
వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఓ వింత వ్యాధి వెలుగు చూసింది. దీనికి కారణాన్ని వైద్యులు ఇప్పటికీ కనిపెట్టలేక పోతున్నారు. అయితే, వివిధ రకాలుగా జరిగిన పరీక్షల్లో వైద్యులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. 
 
ఒకే ప్రాంతం నుంచి ఎక్కువమంది ఈ సమస్యతో ఆస్పత్రి పాలవుతున్నారు. కాబట్టి వారు తినే ఆహారంలో ఆర్గానో  పాస్ఫేట్‌, లేక ఫైలేత్రిం విష పదార్థం కలిసి ఉంటుందని వైద్యులు అంచనాకు వచ్చారు. ఈ విష పదార్థం శరీరంలోకి వెళ్లడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. తొలుత మెదడు, వెన్నెముకతో పాటు శరీరంలోని నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సమయంలో నెమ్మదిగా ఒళ్లు నొప్పులు ప్రారంభమై, అకస్మాత్తుగా మూర్ఛ వస్తుంది. 
 
ప్రస్తుతం ఏలూరులో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం మందిలో ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంత వాసులు తీనే ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా విషపదార్థాలు కలిసివుంటాయని భావిస్తున్నారు. 
 
మరోవైపు ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో మరొక లక్షణాన్ని సోమవారం వైద్యులు గుర్తించారు. బాధితుల కళ్లను పరిశీలించగా, 'ప్యూపిల్‌ డైలటేషన్' అనే సమస్య బయటపడింది. విషపదార్థాల ప్రభావం నాడీవ్యవస్థపై పనిచేసి.. కంటిలోని నల్లగుడ్డు స్పందన తగ్గుతుందని, కళ్లు బైర్లు కమ్మడం వంటి సమస్యలు దీనివల్ల తలెత్తుతాయని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 
 
ఆరోగ్యశాఖ ఇప్పటివరకూ చేసిన పరీక్షల వల్ల ఎలాంటి సమస్య బయటపడలేదు. అందరి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి. 45 మందికి బ్రెయిన్‌ సీటీ స్కాన్‌ చేశారు. ఇందులోనూ ఏమీ తేలలేదు. తొమ్మిది డెయిరీల నుంచి పాల నమూనాలు తీసుకున్నారు. ఈ రిపోర్టులు రావాల్సి ఉంది. కల్చర్‌ రిపోర్టు, ఈ-కోలీ పరీక్ష ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. 
 
సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ అనాలసిస్‌ కోసం 10 మంది దగ్గర నుంచి శాంపిల్స్‌ తీసుకుని హైదరాబాద్‌ సీసీఎంబీకి పంపించారు. రిపోర్టు 36 గంటల తర్వాత రావచ్చు. ఒకవేళ వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఈ వ్యాధికి కారణమయితే ఈ పరీక్షల్లో తెలిసిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు