ఆంధ్రాకు టాటా చెప్పేసిన అమెరికా కంపెనీ... తన్నుకుపోయిన తెలంగాణ

శనివారం, 26 జూన్ 2021 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. నిన్నటికి నిన్న రిలయన్స్ ఆంధ్రా నుంచి వెళ్లిపోయింది. ఇపుడు అమెరికాకు చెందిన ట్రైటాన్ సంస్థ కూడా టాటా చెప్పేసింది. ఈ సంస్థ తెలంగాణాలో భారీ విద్యుత్‌ వాహనాల యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.  దీనిపై గురువారం ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం కూడా కుదిరింది. దీనివల్ల రూ.2100 కోట్ల పెట్టుబడి, దాదాపు 25వేల మందికి ఉపాధి లభించే అవకాశముందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే... ఇదే ట్రైటాన్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో 2018 సెప్టెంబరు 29వ తేదీన ఎంవోయూ కుదుర్చుకుంది. టీడీపీ సర్కారు హయాంలో ఆ కంపెనీతో మాట్లాడి నవ్యాంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలు వివరించి ఇక్కడకు వచ్చేలా ఒప్పించారు. రూ.727 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సోలార్‌ బ్యాటరీ తయారీ ప్లాంటు నిర్మించేందుకు ‘ట్రెటాన్‌ సోలార్‌’ ముందుకు వచ్చింది. ఇది ప్రింటబుల్‌ సోలార్‌ సెల్స్‌, ప్రింటెడ్‌ లైటింగ్‌, ప్రింటెడ్‌ బ్యాటరీల తయారీలో అగ్రశ్రేణి సంస్థ. కానీ, ఏపీ సర్కారు వ్యవహారశైలి కారణంగా పొరుగు రాష్ట్రానికి తరలివెళ్లిపోయింది.
 
ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరుపతి సమీపంలో ప్రారంభిస్తామన్న సెజ్‌తోపాటు అమరావతిలోను ఒక భారీ సెజ్‌ను పెట్టేందుకు చర్చలు జరిగాయి. చైనాలోని అతి పెద్ద సెజ్‌ల మాదిరిగా ఇక్కడ కూడా ఒకేచోట లక్షమందికి ఉపాధి కల్పించేలా ఈ సెజ్‌ను పెట్టాలని భావించారు. అయితే ఇప్పుడు తిరుపతిలో పెట్టేందుకు కుదిరిన ఎంఓయూ నుంచే రిలయన్స్‌ వెనక్కి వెళ్లిపోయింది. ఇక అమరావతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదం చేయడంతో... ఇక్కడకూ రాకుండా పోయిందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు