ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పదవి ఇస్తామని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అనివార్య కారణాలతో అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కాగా, ఇటీవల కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లాతో పాటు నలుగురిని గవర్నర్లుగా నియమించారు.
అప్పుడే మోత్కుపల్లిని కూడా గవర్నర్‌గా నియమించాలని కేంద్రం భావించినా.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నందున మోత్కుపల్లి విషయాన్ని పక్కనబెట్టింది. ప్యాకేజీ ప్రకటన తర్వాత మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తామని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీ అయిన తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ గవర్నర్ పదవులు త్వరలో భర్తీ చేయనున్నారు. ఆ భర్తీల్లో భాగంగా మోత్కుపల్లికి అవకాశం రావొచ్చు. ఎందుకంటే మోత్కుపల్లి బయోడేటాను పీఎంఓ పరిశీలిస్తోంది.
దీనిపై పీఎంవో అధికారులు, సీఎం చంద్రబాబుతో, మోత్కుపల్లితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. తమిళనాడు గవర్నర్‌గా గుజరాత మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అరుణాచల్‌కు మోత్కుపల్లిని నియమించకపోతే.. మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లాను అరుణాచల్‌కు మార్చి.. అక్కడ నియమిస్తారన్నది హస్తిన వర్గాల సమాచారం.