ఏపీకి అనతికాలంలోనే ప్రత్యేక హోదా.. ముఖ్యమంత్రి జగనే.. వేద పండితులు

శనివారం, 6 ఏప్రియల్ 2019 (10:33 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 


ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

‘మీకు, మీ కుటుంబసభ్యులందరికి శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇంకా ఉగాదిని పురస్కరించుకుని శనివారం ఉదయం అమరావతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పండితులు, ఈ వికారి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న అంశంపై పండితులు విశ్లేషించారు. వైసీపీకి అధికారం లభిస్తుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పండితులు చెప్పారు. అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానుందని వేద పండితులు పంచాంగశ్రవణంలో జోస్యం చెప్పారు.
 
వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని, రైతులకు మంచి పంటలు పండుతాయని చెప్పారు. జగన్‌కు అన్ని గ్రహాలూ అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఆయన సుస్థిరమైన పాలన అందిస్తారని అంచనా వేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వేదాశీర్వచనం చేసి, నూతన పట్టు వస్త్రాలను పండితులు అందించారు. ఆపై జగన్ వారిని సత్కరించి, తాంబూలాన్ని అందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు