కరోనాపై విజయానికి వైఎస్.జగన్ మరో బాహుబలి కావాలి : ఉండవల్లి

గురువారం, 30 జులై 2020 (17:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా, గత రెండు రోజులుగా ఈ వైరస్ కేసుల సంఖ్య పది వేలు దాటిపోయాయి. ఫలితంగా ఏపీలో మొత్తం కరోనా కేసు సంఖ్య లక్షను దాటిపోయి, రెండో స్థానానికి పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో గెలిచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొండంత బలాన్ని ఇవ్వాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన జగన్ కు ఓ లేఖ రాశారు. 
 
రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని లేఖలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడితే జీవించలేమనే ఆవేదనలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారన్నారు. కరోనా రోగుల కోసం తాత్కాలిక సహాయ కేంద్రాలను నడపాలని... ఇందుకోసం ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ట్రస్టులు, ఎన్జీవో సంస్థలకు అప్పగించాలని కోరారు.
 
ఈ కేంద్రాలకు అయ్యే నిర్వహణ ఖర్చును ట్రస్టులు, ఎన్జీవోలు భరిస్తాయని... ప్రభుత్వం వైపు నుంచి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే ఒక ఫంక్షన్ హాల్‌ను రాజమండ్రిలోని జైన్ సంఘం అద్దెకు తీసుకుందని... అందులో 60 పడకలతో ఒక కరోనా సెంటర్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా కరోనా పరీక్షలు నిర్వహించేలా అనుమతిచ్చి, వాటి ఫీజులను ప్రభుత్వం నిర్ణయించాలని ఉండవల్లి సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు